ఢిల్లీ: దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవేను నిర్మించేందుకు ప్రణాళిక రచిస్తోంది భారత ప్రభుత్వం. తొలి రహదారిని దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలమధ్య నిర్మించనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ రహదారిపై ట్రాలీబస్సుల మాదిరిగానే ట్రాలీ ట్రక్కులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు. దాని ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు సామర్థ్యం పెరుగుతుందన్నారు.
ఢిల్లీలో నిర్వహంచిన హైడ్రాలిక్ ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్ కార్యక్రమం వేదికగా తొలి ఎలక్ట్రిక్ హైవే వివరాలను బహిర్గతం చేశారు గడ్కరీ. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2.5 లక్షల సొరంగాలను నిర్మించినట్లు తెలిపారు. 'ఢిల్లీ నుంచి ముంబై వరకు ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలని ప్రణాళిక చేస్తున్నాం. ట్రాలీబస్సుల మాదిరిగానే మీరు ట్రాలీట్రక్కులను ఈ దారిలో తీసుకొస్తాం.' అని తెలిపారు. అయితే.. ఈ రహదారి గురించి పూర్తి వివరాలను వెల్లడించలేదు.
ఎలక్ట్రిక్ హైవే అంటే ఏమిటి?
ఎలక్ట్రిక్ హైవే అనగానే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. వాహనాలకు ఈ రహదారులపై వెళ్తున్న క్రమంలో ఓవర్‌హెడ్ విద్యుత్తు లైన్ల ద్వారా పవర్ సరఫరా చేస్తారు. రైల్వే ట్రాక్‌ల మాదిరిగానే ఉంటాయి. హైవే పొడవున ఓవర్‌హెడ్ విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేస్తారు. ట్రాలీబస్సులు, ట్రాలీట్రక్కులను ఉపయోగించటం ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు రవాణా సామర్థ్యం పెరుగుతుందనేది కేంద్రం ఆలోచన.
మరోవైపు.. పెట్రోల్, డీజిల్‌ల ద్వారా కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో భారీ వాహనాల ఓనర్లు ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయాలవైపు వెళ్లాలని కోరారు నితిన్ గడ్కరీ. అలాగే.. అన్ని జిల్లా కేంద్రాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానిస్తామన్నారు. ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతుందని, ఆర్‌టీఓల ద్వారా అందే సేవలను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించటమే తమ లక్ష్యమన్నారు. వస్తు రవాణా వ్యయం చైనా, ఐరోపా, అమెరికాలతో పోలిస్తే భారత్‌లోనే అధికమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా?
Comments
Please login to add a commentAdd a comment