న్యూఢిల్లీ: దేశంలో 2020 సంవత్సరంలో రోజుకు 31 మంది చొప్పున చిన్నారులు(18 ఏళ్లలోపు వారు) బలవన్మరణాలకు పాల్పడినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పిల్లలు ఎదుర్కొనే మానసిక సమస్యలు కోవిడ్ మహమ్మారితో ఏర్పడిన పరిస్థితులతో మరింత పెరగడమే ఇందుకు కారణం కావచ్చునని నిపుణులు అంటున్నారు. 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,396 మంది బాలలు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్ క్రైం బ్యూరో నివేదిక తెలిపింది.
2019తో పోలిస్తే 18%, 2018 కంటే 21% ఇది ఎక్కువని పేర్కొంది. 2019లో 9,613 మంది, 2018లో 9,413 మంది బాలలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు గణాంకాలు వెల్లడించాయి. నివేదిక ప్రకారం.. 2020లో ప్రధానంగా కుటుంబసమస్యలతో 4,006 మంది, ప్రేమ వ్యవహారం కారణంగా 1,337 మంది, అనారోగ్య కారణాలతో 1,327 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇవికాకుండా, సినీ హీరోల ఆరాధన, నిరుద్యోగం, ఆకస్మిక నష్టం, డ్రగ్స్ అలవాటు తదితర కారణాలతోనూ ఆత్మహత్యలు చేసుకున్న కేసులున్నాయి.
కోవిడ్ మహమ్మారితో స్కూళ్లు మూతబడటం, సామాజికంగా ఒంటరితనంతోపాటు పెద్దల్లో ఆందోళన వల్ల కూడా చిన్నారుల మానసిక ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువై, వారిలో విపరీత నిర్ణయాలకు కారణమై ఉండవచ్చని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాత్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘మన సమాజంలో విద్య, ఆరోగ్యం సంబంధ అంశాలపై పెట్టినంత శ్రద్ధ మానసిక ఆరోగ్యానికి ఇవ్వలేకపోతున్నాం. చిన్నారుల బలవన్మరణాలు పెరుగుతుండటం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. పిల్లలు తమ శక్తియుక్తులను తెలుసుకుని, భవిష్యత్ కలలను నిజం చేసుకునే వాతావరణం కల్పించడం తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వాల బాధ్యత’ అని కుమార్ అన్నారు.
ఎన్‌సీబీ రిపోర్టుపై క్రై(చైల్డ్ రైట్స్ అండ్ యూ) సంస్థ పాలసీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రీతి మహారా స్పందిస్తూ.. 2020లో బలవన్మరణాలకు పాల్పడిన 11,396 మందిలో బాలురు 5,392 మంది కాగా బాలికలు 6,004 మంది ఉన్నారన్నారు. రోజుకు 31 మంది, గంటకు సుమారు ఒకరు చొప్పున తనువు చాలించారు. చిన్నారులు ఇళ్లలోనే ఉండిపోవాల్సి రావడం, కుటుంబసభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు వారితో సన్నిహితంగా మాట్లాడేందుకు అవకాశం లేకపోవడం, కుటుంబసభ్యుల మరణం వంటివి ఈ పరిస్థితికి దారి తీసింది’ అని తెలిపారు. ‘దీనిని నివారించేందుకు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ బిడ్డల మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేస్తుండాలి’ అని మానసిక ఆరోగ్య నిపుణురాలు ప్రకృతి పొద్దార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment