చచ్చిన ఎలుకలను కనుగొనేందుకు భారతీయ రైల్వే వివిధ స్టేషన్లలో బోరెస్కోపిక్ కెమెరాలను వినియోగించనుంది. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినా ప్రయాణికులు, రైల్వే ఉద్యోగుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని ముంబైలో ప్రారంభించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
రైల్వే స్టేషన్లలోని వెయిటింగ్ హాల్, ఆఫీసు, క్యాంటీన్‌లోని మూలల్లో ఎలుకలు చనిపోతుంటాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మీడియాకు తెలిపారు. చచ్చిన ఎలుకల నుంచి దుర్వాసన వస్తుండటంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఇబ్బంది పడుతుంటారు. దీనికి సంబంధించిన ఫిర్యాదులు తరచుగా అందుతుండటంతో చచ్చిన ఎలుకలను వెతికేందుకు సెంట్రల్ రైల్వే రెండు అత్యాధునిక బోరోస్కోపిక్ కెమెరాలను కొనుగోలు చేసింది.
బోరోస్కోపిక్ కెమెరా అతి చిన్న ప్రదేశంలోకి కూడా వెళుతుంది. సాధారణంగా చూడలేని ప్రాంతాన్ని కూడా స్కాన్ చేసి చూపిస్తుంది. దీని సాయంతో ఆయా ప్రాంతాల్లో స్కాన్ చేసి చచ్చిన ఎలుకలను గుర్తిస్తారు. తరువాత వాటిని అక్కడి నుంచి తొలగిస్తారు. ఈ కెమెరాలను ప్రయోగపూర్వకంగా ఉపయోగించినప్పుడు స్టేషన్ లాబీ, టాయిలెట్, వాష్‌రూమ్ సీలింగ్ వెనుక కొన్ని చచ్చిన ఎలుకలు కనిపించాయి. అనంతరం ఆ ఎలుకలను తొలగించారు. ప్రస్తుతానికి ముంబై స్టేషన్లో రెండు కెమెరాలు అమర్చినట్లు ముఖ్య ప్రజాసంబంధాల అధికారి తెలిపారు. త్వరలో ఇతర స్టేషన్లలోనూ ఇటువంటి కెమెరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment