సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని పరితేవాడి గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌సిన్హ్ డిసేల్ (32) చరిత్ర సృష్టించారు. భారతదేశంలో క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ విప్లవానికి పునాదివేయడంతోపాటు, బాలికా విద్య ప్రోత్సాహానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఒక మిలియన్ డాలర్ల వార్షిక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 కు విజేతగా ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 10మంది ఫైనలిస్టులతో పోటీపడి మరీ డిసేల్ ఈ ఘనతను సాదించారు. అంతేకాదు తన ప్రైజ్ మనీని తోటిపోటీదారులతో కలిసి పంచుకుంటానని ప్రకటించి విశేషంగా నిలిచారు. వృత్తిపరంగా వారు చేసిన అసాధారణమైన కృషికి మద్దతుగా తన బహుమతిలో 50 శాతం నగదును టాప్-10 ఫైనలిస్టులతో పంచుకుంటానని ఆయన ప్రకటించారు. అంటే మిగతా తొమ్మిదిమంది ఫైనలిస్టులు ఒక్కొక్కరూ 55 వేల డాలర్లు చొప్పున అందుకుంటారు.
బహుమతి డబ్బును పంచుకున్న మొదటి విజేతగా చరిత్ర సృష్టించారని ప్రముఖ దాత, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వర్కీ అన్నారు. తద్వారా పంచుకోవడం, ఇవ్వడంలోని ప్రాముఖ్యతను ప్రపంచానికి బోధించారని ప్రశంసించారు. రంజిత్‌లాంటి ఉపాధ్యాయులు క్లైమేట్ చేంజ్‌ను నిలువరించడంతో పాటు, శాంతియుతమైన, ధర్మబద్ధమైన సమాజాలను నిర్మిస్తారని, అసమానతలను తొలగించి ఆర్థికవృద్ధితో ముందుకు నడిపిస్తారని యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) సహాయ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా జియాన్నిని కొనియాడారు. తద్వారా మన భవిష్యత్తును కాపాడుతారని పేర్కొన్నారు. మరోవైపు కరోనా మహమ్మారి విద్యను, విద్యార్థులను బాగా ప్రభావితం చేసింది. కానీ ఈ కష్ట సమయంలో ప్రతి విద్యార్థి వారి జన్మహక్కు అయిన నాణ్యమైన విద్యను పొందేలా తమ వంతు కృషి చేస్తున్నారని డిసేల్ అన్నారు.
డిసేల్ కృషి
2009 లో సోలాపూర్‌లోని పరితేవాడిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు డిసెల్ వచ్చినప్పుడు అదొక శిధిలమైన భవనం. స్టోర్ రూంగా, పశువుల కొట్టంగా దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేది. ఈ పరిస్థితిని ఛాలెంజింగ్‌గా తీసుకున్న డిసెల్ పాఠశాల సంస్కరణకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు బాలికలను పాఠశాలకు రప్పించాలని ధ్యేయంగా పెట్టుకన్నారు. అలాగే గ్రామంలో బాల్య వివాహాలను అడ్డుకోవడంపై దృష్టి పెట్టారు. ఆయన కృషి ఫలితంగా 100శాతం బాలికలు హాజరుకావడం మాత్రమే కాదు, గ్రామంలో బాల్య వివాహాలను పూర్తిగా నిలువరించగలిగిన ఘనతను దక్కించుకున్నారు.
విద్యార్థులకు స్థానిక భాషలో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడటం, తరగతి పాఠ్యపుస్తకాలను విద్యార్థుల మాతృభాషలోకి అనువదించడమే కాకుండా, ఆడియో పాఠాలను అందించేందుకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌లను తీసుకొచ్చారు. వీటితోపాటు వీడియో ఉపన్యాసాలు, కథలు, ఎసైన్‌మెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేశారు. దీంతో మహారాష్ట్రలో క్యూఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టిన తొలి పాఠశాలగా డిసేల్ ఆధ్వర్యంలోని స్కూలు నిలిచింది. డిసేల్ ప్రతిపాదిత పైలట్ పథకం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడతామని రాష్ట్ర మంత్రిత్వ శాఖ 2017 లో ప్రకటించింది. అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టి) పాఠ్యపుస్తకాలు క్యూఆర్ కోడ్‌తో రూపొందించాలని 2018లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రపంచ దేశాల యువకుల మధ్య శాంతిని పెంపొందించేందుకుకూడా డిసేల్ విశేష కృషి చేశారు."లెట్స్ క్రాస్ ది బోర్డర్స్" ప్రాజెక్ట్ పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో భారతదేశం, పాకిస్తాన్, పాలస్తీనా ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, యుఎస్ , ఉత్తర కొరియాకు చెందిన అనేకమంది యువకులను భాగస్వామ్యం చేశారు. ఇప్పటివరకు, ఎనిమిది దేశాల 19,000 మంది విద్యార్థులనుఇందులో చేరడం విశేషం. అంతేకాకుండా, మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేటర్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ ద్వారా వీకెండ్స్‌లో విద్యార్థులను వర్చువల్ ఫీల్డ్ ట్రిప్స్‌కు తీసుకెళతారు. మరీ ముఖ్యంగా తన ఇంటిలో నిర్మించిన సైన్స్ ల్యాబ్ ద్వారా శాస్త్రీయ ప్రయోగాలతో విద్యార్థులను ఆకట్టుకుంటూ మరింత పాపులర్ అయ్యారు.
కాగా 2014 లో వర్కీ ఫౌండేషన్ ఏర్పాటైంది. ఉపాధ్యాయు వృత్తిలో విశేష కృషి చేసిన అసాధారణమైన టీచర్లను గౌరవిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వార్షిక బహుమతిని ప్రకటిస్తుంది. 140 కి పైగా దేశాల నుండి 12వేల మందికి పైగా దరఖాస్తు చేయగా తుది విజేతగా డిసేల్ ఎంపికయ్యారు. నైజీరియాకు చెందిన ఒలాసుంకన్మి ఒపీఫా, యూకేకు చెందిన జామీ ఫ్రాస్ట్, ఇటలీ నుండి కార్లో మజ్జోన్, దక్షిణాఫ్రికా నుండి మోఖుడు సింథియా మచాబా, అమెరికాకుచెందిన లేహ్ జుయెల్కే, యున్ జియాంగ్, దక్షిణ కొరియాకు చెందిన హ్యూన్, మలేషియాకు చెందిన శామ్యూల్ యెషయా, వియత్నాం నుండి హన్హ్ ఫాంగ్ , బ్రెజిల్ నుండి డోని ఇమాన్యులా బెర్టాన్ టాప్ 10లో నిలిచారు. గ్లోబల్ టీచర్ ప్రైజ్ మనీని 10 సంవత్సరాలలో సమాన వాయిదాలలో చెల్లిస్తుంది
Comments
Please login to add a commentAdd a comment