భారీగా పెరుగుతున్న ఇంటర్నెట్‌ సగటు వినియోగం | Indias active Internet population to hit 900 million by 2025 | Sakshi
Sakshi News home page

భారీగా పెరుగుతున్న ఇంటర్నెట్‌ సగటు వినియోగం

Published Fri, Jun 4 2021 2:05 PM | Last Updated on Fri, Jun 4 2021 2:05 PM

Indias active Internet population to hit 900 million by 2025 - Sakshi

ఇంటర్నెట్‌ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. నగరాలే కాదు గ్రామీణ ప్రాంతాలకూ ఇది పాకింది. దేశంలో 10 మంది యాక్టివ్‌ ఇంటర్నెట్‌ యూజర్లలో.. తొమ్మిది మంది ప్రతిరోజు ఇంటర్నెట్‌లో విహరిస్తున్నారట. ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, కాంటార్‌ క్యూబ్‌ నివేదిక ప్రకారం.. యాక్టివ్‌ యూజర్‌ సగటున రోజూ 107 నిముషాలు(ఒక గంట 47 నిముషాలు) నెట్‌ వాడుతున్నారు. గ్రామీణ యూజర్లతో పోలిస్తే అర్బన్‌ కస్టమర్లు 17 శాతం ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ఇరు ప్రాంతాల వారూ మొబైల్‌లోనే క్లిక్‌ చేస్తున్నారు. అందుబాటు ధరలో మొబైల్స్‌ లభించడం, చవక డేటా చార్జీల కారణంగా ఇంటర్నెట్‌ వాడకం విషయంలో మొబైల్‌ తొలి ఎంపిక అయింది. టెలికం కంపెనీల దూకుడుకుతోడు ఆధునిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు వెల్లువెత్తుతుండడంతో మార్కెట్‌ అనూహ్యంగా వృద్ధి చెందుతోంది. 

అయిదేళ్లలో 90 కోట్లు.. 
యాక్టివ్‌ ఇంటర్నెట్‌ వినియోగదార్లు 2025 నాటికి 90 కోట్లకు చేరుకుంటారని నివేదిక అంచనా వేస్తోంది. 2020లో ఈ సంఖ్య 62.2 కోట్లుంది. అయిదేళ్లలో ఇంటర్నెట్‌ వాడుతున్న మొత్తం కస్టమర్లలో అత్యధికులు గ్రామీణ భారత్‌ నుంచి ఉంటారు. దేశంలో డిజిటల్‌ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది. పెరుగుతున్న గ్రామీణ నెటిజన్ల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి తగ్గ వ్యవస్థ అభివృద్ధి చెందాలి. ఇంటర్నెట్‌ విస్తృతి గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో రెండింతలు ఉన్నప్పటికీ.. గ్రామాల్లో ఇంటర్నెట్‌ వాడకం ఏటా వేగంగా పెరుగుతోంది. రాబోయే కొన్నేళ్లు వ్యవహారిక భాషలు, వాయిస్, వీడియోలు డిజిటల్‌ వ్యవస్థ మార్పుకు కీలకం కానున్నాయని కాంటార్‌ ప్రతినిధి విశ్వప్రియ భట్టాచార్జీ తెలిపారు.   

ఇవీ ఇంటర్నెట్‌ గణాంకాలు.. 
దేశంలో 2020లో ఇంటర్నెట్‌ యూజర్లు పట్టణ ప్రాంతాల్లో 4 శాతం పెరిగి 32.3 కోట్లుగా ఉన్నారు. పట్టణ జనాభాలో వీరి వాటా 67 శాతం. ఇక గ్రామీణ భారత్‌లో నెటిజన్లు 13 శాతం పెరిగి 29.9 కోట్లకు చేరుకున్నారు. గ్రామీణ జనాభాలో వీరి వాటా 31 శాతం ఉంది. యాక్టివ్‌ ఇంటర్నెట్‌ యూజర్లలో టాప్‌–9 మెట్రోల వాటా 33 శాతం నమోదైంది. ప్రతి అయిదుగురిలో ఇద్దరు చిన్న పట్టణాల నుంచి ఉంటున్నారు. 143.3 కోట్ల జనాభాలో 43 శాతం మంది (62.2 కోట్లు) యాక్టివ్‌ ఇంటర్నెట్‌ కస్టమర్లు ఉన్నారు. గ్రామాల్లో అత్యధికులు ఇప్పటికీ ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నెట్‌ వృద్ధికి ఆస్కారం ఉంది’ అని నివేదిక వివరించింది.

చదవండి: రూ.25,000 వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement