ముంబై : రైతుల దిగుబడులకు మార్కెటింగ్ ఊతమిచ్చేలా కిసాన్ రైలు పట్టాలెక్కింది. మహారాష్ట్రకు చెందిన నాసిక్ జిల్లా దియోలలి నుంచి బిహార్‌లోని దనాపూర్‌కు దేశంలోనే తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల రవాణాకు కిసాన్ రైలు ఉపయోగపడుతుందని అన్నారు. రైతులు తమ దిగుబడులకు సరైన ధర పొందేలా తక్కువ చార్జీలతోనే ఈ రైలు సేవలు అందిస్తుందని స్పష్టం చేశారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆహారోత్పత్తుల సరఫరా కోసం భారత రైల్వేలు 96 రూట్లలో 4610 రైళ్లను నడుపుతున్నాయని చెప్పారు. రైతులు స్వయంసమృద్ధి సాధించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు చర్యలు చేపడుతున్నారని ఈ కార‍్యక్రమానికి అధ్యక్షత వహించిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
దియోలలి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరే కిసాన్ రైల్ మరుసటి రోజు సాయంత్రం 6.45 గంటలకు దనాపూర్ చేరుకుంటుంది. ఇక తిరుగుప్రయాణంలో భాగంగా ప్రతి ఆదివారం రాత్రి 12 గంటలకు దనాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.45 గంటలకు దియోలలి చేరుకుంటుంది. ఈ రైలు ఒక ట్రిప్‌లో 31.45 గంటల ప్రయాణంలో 1519 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. కిసాన్ రైలు నాసిక్ రోడ్, మన్మాడ్, జల్గావ్, భుసావల్, బుర్హాన్‌పూర్, ఖండ్వా, ఇటార్సి, జబల్‌పూర్, సత్నా, కట్ని, మాణిక్‌పూర్, ప్రయాగరాజ్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, బుక్సార్ స్టేషన్లలో ఆగుతుంది. కాగా, కిసాన్ రైల్ రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తుందని, స్ధానిక రైతులు, వ్యాపారులు, మార్కెట్ కమిటీలతో కలిసి రైల్వేలు రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తాయని కేంద్ర రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : రైతు పెన్షన్ స్కీమ్‌కు శ్రీకారం..
Comments
Please login to add a commentAdd a comment