
సూళ్లూరుపేట: గగన్‌యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రపొల్షన్ సిస్టం (ఎస్‌ఎంపీఎస్)ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా పరీక్షించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రోకు చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఈ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్టుగా గురువారం ఇస్రో ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ పరీక్షలో 440 ఎన్ థ్రస్ట్‌తో ఐదు లిక్విడ్ అపోజి మోటార్ ఇంజిన్లు, 100 ఎన్ థ్రస్ట్‌తో 16 రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్ట్‌ర్లను పరీక్షించారు. గగన్‌యాన్ సర్వీస్ మాడ్యూల్‌కు 440 ఎన్ ఇంజిన్లు మిషన్ ఆరోహణ దశలో ప్రధాన చోదకశక్తిని అందిస్తాయి. సుమారు 250 సెకెండ్లపాటు నిర్వహించిన పరీక్షలో లిక్విడ్ అపోజి మోటార్ ఇంజిన్లు, రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్టర్లను పరీక్షించి సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు.