లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ యూపీలో అత్తరు వ్యాపారుల మీద ఐటీ దాడుల పర్వం చర్చనీయాంశంగా మారింది. ఈమధ్యే కాన్పుర్‌కు చెందిన వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో భారీ నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. ఇది రాజకీయపరమైన విమర్శలకు దారితీసిన తరుణంలో.. మరో ఆసక్తికర పరిణామం ఇవాళ చోటు చేసుకుంది.
సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ అలియాస్ పంపీ జైన్ ఇంట్లో ఇవాళ(శుక్రవారం) ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పుష్పరాజ్ జైన్ ఈ మధ్యే సమాజ్‌వాదీ పార్టీ పేరిట ఓ ప్రత్యేక అత్తరును తయారు చేయించి.. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేతుల మీదుగా లాంచ్ చేయించాడు. ఈ క్రమంలో ఇవాళ జరిగిన దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఐటీ అధికారులు ఉత్తప్రదేశ్‌లోని కన్నౌజ్, కాన్పూర్, దేశ రాజధాని ప్రాంతం, సూరత్, ముంబై, మరికొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఏకకాలంలో దాడులు చేశారు. అయితే ఈ దాడులపై సమాజ్‌వాదీ పార్టీ ట్విటర్‌లో స్పందిస్తూ.. బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను బహిరంగంగా దుర్వినియోగం చేస్తోంది. బీజేపీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. వారు తమ ఓట్ల ద్వారా సమాధానం చేబుతారు’అని పేర్కొంది. అత్తరు వ్యాపార సంస్థలు ఆదాయ పన్ను ఎగవేసినట్లు జీఎస్టీ నుంచి వివరాలు పొందిన తర్వాత ఐటీ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఐటీ అధికారులు కాన్పూర్, కన్నౌజ్ ప్రాంతాల్లో మరో అత్తరు వ్యాపారి పీయూష్ జైన్‌పై దాడులు చేసి.. సుమారు రూ.196 కోట్ల నగదు, 23కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పీయూష్ జైన్ ఇంటిపై జీఎస్‌టీ అధికారుల దాడులు చేసిన సమయంలో పుష్పరాజ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే పేర్లు ఒకేలా ఉండటం వల్ల, ఇద్దరు అత్తరు వ్యాపారులే కావటంతో గందరగోళం తలెత్తినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే పీయూష్ జైన్ వ్యవహారంపై యూపీ పర్యటన సందర్భంగా స్వయానా ప్రధాని మోదీ, అమిత్ షాలు అఖిలేష్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే పుష్పరాజ్ జైన్ బదులు.. పీయూష్ జైన్ సమాజ్‌వాదీ పార్టీకి దగ్గర వ్యక్తని భావించి దాడులు చేసి ఉండొచ్చని అఖిలేష్ బీజేపీ విమర్శలను తిప్పి కొట్టారు కూడా. ఇది జరిగిన రెండు రోజులకే పుష్పరాజ్ ఇంటిపై ఐటీ దాడులు జరగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment