న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ సహా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పలువురు అత్తరు వ్యాపారుల నివాసాలపై ఆదాయపన్ను శాఖ శుక్రవారం దాడులు చేసింది. పన్ను ఎగవేత ఆరోపణలపై వీరి నివాసాలను సోదా చేశామని ఐటీ అధికారులు తెలిపారు. కనౌజ్, కాన్పూర్, ఎన్‌సీఆర్, సూరత్, ముంబై సహా దాదాపు 40 నివాసాలను సోదా చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో దాదాపు రూ. 150 కోట్ల మేర పన్నుఎగవేతకు సంబంధించిన పత్రాలు దొరికినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ నివాసంపై ఐటీ దాడులు చేస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ ఒక ట్వీట్‌లో వెల్లడించింది. ఈ దాడులు బీజేపీ ప్రభుత్వం చేయిస్తున్న దాడులుగా విమర్శించింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు. ఇటీవలే పుష్పరాజ్ జైన్ తయారీ సమాజ్‌వాదీ ఇత్రా అనే అత్తరును అఖిలేశ్ ఆవిష్కరించారు. పుష్పరాజ్‌తో పాటు కనౌజ్, కాన్పూర్‌కు చెందిన వ్యాపారుల నివాసాలపై సోదాలు జరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యాపారుల వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) వివరాలను పరిశీలించిన అనంతరం వీరు పన్ను ఎగవేతకు పాల్పడ్డట్లు భావించి ఐటీ శాఖ దాడులు జరిపిందన్నారు. ఇటీవలే పీయూశ్ జైన్ అనే బడా వ్యాపారిపై ఐటీ దాడులు జరిపి రూ.197 కోట్ల నగదు, 26 కిలోల బంగారం, భారీగా చందన తైలం నిల్వలను స్వాధీనం చేసుకుంది.
చదవండి: (కొత్త సంవత్సరం వేళ విషాదం.. ప్రధాని మోదీ సంతాపం)
అది బీజేపీ సొమ్ము కాదు
పియూష్ జైన్ వద్ద ఇటీవల ఐటీ దాడుల్లో లభించిన రూ. 200 కోట్ల సొత్తు బీజేపీది కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పలువురు భావిస్తున్నట్లు తప్పుడు చిరునామాలో దాడులు జరపలేదని, ముందుగా నిర్ధారించుకున్న వ్యక్తులకు సంబంధించిన స్థలాల్లోనే సోదా జరిగిందని తెలిపారు. ఇంత సొమ్ము తన సన్నిహితుడి వద్ద బయటపడేసరికి అఖిలేశ్‌కు వణుకుపుడుతోందని విమర్శించారు.
పుష్పరాజ్ జైన్ బదులు ఐటీ శాఖ పీయూష్ జైన్‌పై దాడులు జరిపిందని, తెలియకుండా బీజేపీ తన సొంత సొమ్మును స్వాధీనం చేయించిందని విపక్షాలు విమర్శిస్తున్న వేళ మంత్రి నిర్మల ఈ వివరణ ఇచ్చారు. అది బీజేపీ సొమ్మేనని అఖిలేశ్ ఆరోపిస్తున్నారని, ఆ విషయం అఖిలేశ్‌కు ఎలా తెలుసని, భాగస్వామ్యం లేకపోతే పీయూష్‌పై దాడులకు అఖిలేశ్ ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. తప్పుడు చిరునామాలో దాడులు జరిగితే పీయూష్ వద్ద ఇంత సొత్తు ఎలా దొరుకుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment