
న్యూఢిల్లీ, సాక్షి: మహిళపై అత్యాచారయత్నం, ఆపై హత్యాయత్నం ఘటనలతో రెండు వర్గాలు పరస్పర దాడులతో రణరంగంగా మారిన జైనూర్ ప్రస్తుతం కొద్దిగా కోలుకుంటోంది. మరోవైపు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ మంగళవారం తెలంగాణ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది.
సెప్టెంబర్ మొదటివారంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఘటన.. ఆపై నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తీవ్రంగా పరిగణించింది ఎన్‌హెచ్‌ఆర్‌సీ. మీడియా ఆధారంగా వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఆ కథనాల్లో పేర్కొందే గనుక వాస్తవమైతే.. మానవ హక్కులకు తీవ్ర ఉల్లంఘన జరిగినట్లేనని అభిప్రాయపడింది. రెండువారాల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు పంపించింది.
ఆ నివేదికలో.. ఎఫ్‌ఐఆర్‌తో పాటు బాధితురాలి ఆరోగ్య పరిస్థితి, ఆమెకు అందించిన కౌన్సెలింగ్.. ప్రభుత్వం తరఫున అందించిన పరిహార వివరాలను కూడా పొందుపర్చాలని సీఎస్, డీజీపీలకు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: నిమజ్జన టైంలో కోరడం సరికాదు: తెలంగాణ హైకోర్టు