వ్యక్తిగత ఫొటోల దుమారం.. సర్కార్‌ సీరియస్‌ | Karnataka IAS IPS Row: Govt Angry With Roopa Rohini Clash | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ వర్సెస్‌ ఐపీఎస్‌.. వ్యక్తిగత ఫొటోల దుమారం.. సర్కార్‌ తీవ్ర ఆగ్రహం

Feb 20 2023 9:21 PM | Updated on Mar 9 2023 4:26 PM

Karnataka IAS IPS Row: Govt Angry With Roopa Rohini Clash - Sakshi

వ్యక్తిగత ఫొటోలను షేర్‌ చేసుకుని.. ప్రొఫెషనలిజం అనేది లేకుండా.. 

బెంగళూరు: కర్ణాటకలో ఇద్దరు ఉన్నతాధికారిణులు.. ప్రస్తుతం ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇద్దరు అధికారిణులు ఇలా బహిరంగంగా విమర్శలకు దిగడంపై కర్ణాటక ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇద్దరిపై చర్యలకు సిద్ధమని ప్రకటించింది ప్రభుత్వం.

‘సామాన్యులు కూడా ఇంతంగా విమర్శించుకోరు. వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం ఉన్నా.. మీడియా ముందు ఇలా ప్రవర్తించడం సరికాదు. వారి ప్రవర్తనపై చర్యలు తీసుకుంటాం’ అని కర్ణాటక హోంశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ముఖ్యమంత్రి బొమ్మైతో పాటు పోలీస్‌ చీఫ్‌తోనూ చర్చించింది హోం శాఖ. ఇదిలా ఉంటే.. ప్రస్తుత ఘర్షణ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సింధూరి భర్త వెల్లడించారు.

గతంలో జనతాదళ్‌ సెక్యులర్ ఎమ్మెల్యే మహేశ్‌తో.. ఒక రెస్టారెంట్‌లో రోహిణీ సింధూరి దిగిన చిత్రం వైరల్‌ అయింది. ఒక ఐఏఎస్‌ అధికారిణికి రాజకీయ నాయకుడిని కలవాల్సిన అవసరం ఏముందని ఆ సమయంలో ఐపీఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్‌ ప్రశ్నించారు. ఇది ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసింది. ఇక ఆదివారం సింధూరికి చెందిన వ్యక్తిగత ఫొటోలను, రూప సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలనే గతంలో రోహిణి పురుష ఐఏఎస్‌ అధికారులకు షేర్ చేశారని రూపా ఆరోపించారు. ఈ ప్రవర్తనతో వృత్తి పరమైన నియమాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. 2021 నుంచి 2022 మధ్య ఈ చిత్రాలను ముగ్గురు పురుష ఐఏఎస్‌ అధికారులకు షేర్ చేసినట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే అవినీతి ఆరోపణలూ చేశారు. దీనిపై తాను ముఖ్యమంత్రి బొమ్మై, ప్రధాన కార్యదర్శి వందిత శర్మకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 

ఈ ఆరోపణలపై రోహిణి ఘాటుగా స్పందించారు. రూపా తనపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా పరువుకు భంగం కలిగించేందుకు ఆమె నా సోషల్ మీడియా, వాట్సాప్‌ స్టేటస్‌ స్క్రీన్‌షాట్లను సేకరించారు. నేను వీటిని కొందరికి పంపినట్లు ఆమె అంటున్నారు. ఆ వ్యక్తులెవరో చెప్పాలని కోరుతున్నాను. మానసిక అనారోగ్యం అనేది పెద్ద సమస్య. వైద్యుల సహకారంతో దానిని తగ్గించాల్సిన అవసరం ఉంది. బాధ్యాతయుతమైన స్థానంలో ఉన్నవారు ఆ అనారోగ్యం పాలైతే.. అది మరింత ప్రమాదకరం’ అని మండిపడ్డారు. అలాగే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం రూప.. కర్ణాటక హస్త కళల అభివృద్ధి సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌గా సింధూరి విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement