బెంగళూరు: బీజేపీ టికెట్ నిరాకరణతో నొచ్చుకున్న.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలోకి మారిపోయిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు కర్ణాటక కీలక నేతల సమక్షంలో ఆయన ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే..
పార్టీ మారిన గంటల వ్యవధిలోనే ఆయన సొంత నియోజకవర్గం హుబ్బలి-ధార్వాడ్‌కు చేరుకోగా.. అక్కడ ఆయనకు ఊహించని రీతిలో ఘనస్వాగతం లభించింది. జగదీష్ షెట్టర్ భార్య శిల్ప ఆయన్ని హత్తుకుని కంటతడి పెట్టగా.. మద్దతుదారులు పెద్ద ఎత్తున్న షెట్టర్ నిర్ణయాన్ని అభినందిస్తూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. ఆ సమయంలో ఆయన ఆమెను ఓదారుస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కోసం తన భర్త ఎంతో కష్టపడ్డారని, కానీ పార్టీ మాత్రం తన భర్తని ఘోరంగా అవమానించిందని వాపోయారామె.
Video Credits: Public TV
టికెట్ నిరాకరణ మాత్రమే కారణం కాదని.. బీజేపీ తన పట్ల వ్యవహరించిన తీరు కూడా తాను పార్టీ వీడేందుకు ఓ కారణమైందని జగదీష్ షెట్టర్ చెప్తున్నారు. ఒక సీనియర్ నేతగా బీజేపీ నాకు టికెట్ ఇస్తుందని భావించా. కానీ, నాకు అందుకు నిరాకరించింది. ఈ పరిణామం నాకు దిగ్భ్రాంతి కలిగించింది. కనీసం నన్ను పార్టీ మారకూడదని సముదాయించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన జగదీష్ శివప్ప షెట్టర్.. లింగాయత్ వర్గానికి చెందిన బలమైన నేత. కర్ణాటకకు 15వ ముఖ్యమంత్రిగా(2012-13 మధ్య) పని చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. న్యాయవాద వృత్తిలో 20 ఏళ్లు కొనసాగి.. ఆపై రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అసెంబ్లీ స్పీకర్‌గా, ఆపై యడియూరప్ప కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. కర్ణాటక బీజేపీ సంక్షోభంతో 2012 నుంచి ఏడాదిపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సీఎం అభ్యర్థిగా నిల్చున్న ఆయన.. పార్టీ నైతిక ఓటమి తర్వాత ప్రతిపక్ష నేతగా కొనసాగారు.
Comments
Please login to add a commentAdd a comment