
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మధ్యంత బెయిల్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే శుక్రవారం(మే10) సాయంత్రం ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.
జైలు నుంచి బయటికి వచ్చిన ఆయన కారులో నుంచి ఆప్ కార్యకర్తలకు అభివాదం చేశాారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయమని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరపున ప్రచారం చేయడానికి గాను సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మధ్యంతర బెయిల్‌పై ఉన్న సమయంలో సీఎంగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించొద్దని, ఫైల్స్ చూసేందుకు వీలులేదని కోర్టు స్పష్టం చేసింది. తిరిగి జూన్2న కేజ్రీవాల్ లొంగిపోవాలని కోర్టు తెలిపింది.
మే 25న ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు దేశ అత్యున్నత కోర్టు మధ్యంతర బెయిల్ రూపంలో భారీ ఊరటనిచ్చింది. కాగా, లిక్కర్‌స్కామ్ కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్ అప్పటి నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే.