పలు షరతులు విధించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
జూన్ 1 వరకూ బెయిల్.. 2న తిరిగి లొంగిపోవాలి
వచ్చే నెల 5వ తేదీదాకా బెయిల్
ఇవ్వాలన్న కేజ్రీవాల్ తరపు న్యాయవాది
తిరస్కరించిన ధర్మాసనం
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు పలు షరతులు విధించింది. జూన్ 2న తిరిగి తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
కేజ్రీవాల్‌కు వచ్చే నెల 5వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అభిõÙక్ సింఘ్వీ కోరగా, ధర్మాసనం అంగీకరించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని, మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన కేజ్రీవాల్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన వాదనను ధర్మాసనం తిరస్కరించింది.
మధ్యంతర బెయిల్ ఇవ్వడం లేదా జైలు నుంచి విడుదల చేయడం వంటి అంశాల్లో సదరు నిందితుడికి సంబంధించిన ప్రాధాన్యతలు, అతడి చుట్టూ ఉన్న పరిణామాలు, పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. వాటిని విస్మరించడం పొరపాటే అవుతుందని ఉద్ఘాటించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ఈ సంవత్సరంలో చాలా ముఖ్యమైన కార్యక్రమం అని గుర్తుచేసింది.
కేజ్రీవాల్ దోషిగా నిర్ధారణ కాలేదు
కేజ్రీవాల్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయనడంలో సందేహం లేదని.. కానీ, ఆయన ఇంకా దోషిగా నిర్ధారణ కాలేదని, ఆయనకు గతంలో నేర చరిత్ర లేదని, సమాజానికి ఆయన వల్ల ముప్పు సంభవించే పరిస్థితి కూడా లేదని వివరించింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం చట్టబద్ధమేనా? అది చెల్లుబాటు అవుతుందా? అని ప్రశి్నస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని, దానిపై ఇంకా తుదితీర్పు వెలువడలేదని వెల్లడించింది.
కేజ్రీవాల్ కేసు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఉంది కాబట్టి అతడికి బెయిల్ ఇచ్చే అంశాన్ని సానుకూలంగా పరిశీలించామని తెలియజేసింది. నిందితులకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తనకున్న అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో ఉపయోగించుకుందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రతి కేసుకు సంబంధించిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని కోర్టులు మధ్యంతర బెయిల్ ఇస్తుంటాయని పేర్కొంది.
21 రోజులు బెయిలిస్తే పెద్దగా తేడా ఉండదు
తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు విచారణ పూర్తిచేసి, తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వివరించింది.
కేజ్రీవాల్ అప్పీల్ తమవద్దే పెండింగ్‌లో ఉందని, ఈ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలంటూ ఆయనను ఆదేశించడం సరైంది కాదని భావించామని పేర్కొంది. తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ లెక్కచేయలేదని, అందుకే అరెస్టు చేశామంటూ ఈడీ లేవనెత్తిన వాదనపై ధర్మాసనం స్పందించింది. ఇందులో ఇతర కోణాలు కూడా చూడాలని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అని ప్రస్తావించింది.
మద్యం కుంభకోణంలో దర్యాప్తు 2022 ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉందని, కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారని, ఇప్పుడు 21 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తే పెద్దగా తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోకేజ్రీవాల్‌కు వచ్చే నెల 1వ తేదీ దాకా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. షరతులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఈ కేసు మెరిట్‌పై అభిప్రాయాల వ్యక్తీకరణగా చూడొద్దని సూచించింది.
తిహార్ జైలు నుంచి విడుదల
సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ఎదుట భారీసంఖ్యలో గుమికూడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కేజ్రీవాల్ తన కాన్వాయ్‌తో జైలు నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, కుమార్తె హర్షితా, ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ఉన్నారు.
సుప్రీంకోర్టు షరతులివే..
1. రూ.50,000 బెయిల్ బాండు సమరి్పంచాలి, అంతే మొత్తం పూచీకత్తును తిహార్ జైలు సూపరింటెండెంట్‌కు అందజేయాలి.
2. బెయిల్‌పై బయట ఉన్నప్పుడు అధికారిక కార్యాలయంలో గానీ, ఢిల్లీ సచివాలయంలోని గానీ అడుగు పెట్టరాదు.
3.లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోకుండా అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు
4. మద్యం కుంభకోణం కేసు గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని, సాక్షులతో భేటీ కావడం, సంప్రదింపులు జరపడం వంటివి చేయొద్దు.
5. మద్యం కేసుతో సంబంధం ఉన్న అధికారిక ఫైళ్లను చూడొద్దు.
Comments
Please login to add a commentAdd a comment