సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం చుట్టూతా ఉన్న ప్రధాన పట్టణాలను అనుసంధానించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రీజనల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టును కొలిక్కి తెచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారుల్లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు రాని కారణంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు మాట్లాడుతానన్నారు. తెలంగాణవ్యాప్తంగా నిర్మించిన ఆరు జాతీయ రహదారులను గడ్కరీ సోమవారం ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
అలాగే మరో 8 హైవేల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, వీకే సింగ్, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆరోగ్యం సహకరించక పోవడంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని వేముల ప్రశాంత్‌రెడ్డి గడ్కరీకి చెప్పగా ఆయన త్వరగా కోలుకోవాలని గడ్కరీ ఆకాంక్షించారు. కేసీఆర్ ఢిల్లీ వచ్చినప్పుడు తాను భేటీ అవుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా గడ్కరీ రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన, చేపడుతున్న రోడ్ల నిర్మాణ వివరాలను... ఇందుకోసం కేటాయించిన నిధుల లెక్కలను వివరించారు.
ఆరేళ్లలో 17,617 కోట్లతో కొత్త రోడ్లు...
గత ఆరేళ్లలో రూ. 17,617 కోట్లతో 1,918 కి.మీ. కొత్త జాతీయ రహదారులను తెలంగాణకు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫలితంగా పెద్దపల్లి జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానమయ్యాయన్నారు. త్వరలో పెద్దపల్లికి కూడా రోడ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ. 4,793 కోట్లతో చేపట్టిన 841 కి.మీ. రోడ్లు పూర్తయ్యాయని, మిగతావి గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భారత్‌మాలా పరియోజనలో భాగంగా తెలంగాణలో 1,730 కి.మీ. మేర రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్టు గడ్కరీ వెల్లడించారు. డీపీఆర్ తయారీలో ఉన్న రూ. 24 వేల కోట్ల విలువైన రహదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత తొందరగా పనులు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రూ. 500 కోట్ల అదనపు సీఆర్‌ఎఫ్ పనులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం రూ. 250 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రతిపాదించిన మేరకు హైదరాబాద్‌లో వర్షాల వల్ల దెబ్బతిన్న జాతీయ రహదారి మరమ్మతుల కోసం వెంటనే పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు రూ. 600 కోట్లతో చేపట్టే ఎల్‌బీ నగర్–మలక్‌పేట రోడ్డు క్యారెజ్ వే విస్తరణ పనలకు వచ్చే జనవరిలో ఆమోదం తెలపనున్నట్లు తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరినట్లుగా నిజామాబాద్–జగ్దల్‌పూర్ రోడ్డు విస్తరణ చేపట్టనున్నట్టు చెప్పారు. గగన్‌పహాడ్ వద్ద ఫ్‌లై ఓవర్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ హైటెన్షన్ స్తంభాల తొలగింపును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కీలకమైన భారత్‌మాల ప్రాజెక్టు ఫేజ్–1కు సంబంధించి రూ. 24 వేల కోట్ల విలువైన పనుల్లో భూసేకరణను వేగిరం చేయాలని గడ్కరీ రాష్ట్రాన్ని కోరారు. 5,787 హెక్టార్లకుగాను ఇప్పటివరకు 160 హెక్టార్లు మాత్రమే సేకరించారని, సాధ్యమైతే సీఎం ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
వెయ్యి కి.మీ. కొత్త హైవేలు కావాలి: వేముల
రాష్ట్రం ఏర్పడ్డాక 3135 కి.మీ.నిడివి గల జాతీయ రహదారుల ఏర్పాటుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపినా ఇప్పటివరకు 1,366 కి.మీ. నిడివిమేర మాత్రమే జాతీయ రహదారులుగా మార్చారని, మిగతాది పెండింగులోనే ఉందని మంత్రి వేముల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్‌హెచ్ సాంద్రత 3.49 కి.మీ.(100 చ.కి.మీ.లలో) మాత్రమేనని, ఇది జాతీయ సగటు కంటే తక్కువన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం వెయ్యి కి.మీ. కొత్త జాతీయ రహదారులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము ప్రతిపాదించిన 340 కి.మీ. రీజినల్ రింగు రోడ్డును మంజూరు చేయాలని కోరారు. ఇందుకు భూసేకరణలో 50 శాతం భరించేందుకు సీఎం సమ్మతించారని గుర్తు చేశారు. రూ.వేయి కోట్ల సీఆర్‌ఎఫ నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.
సోమవారం ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే మరో 8 హైవేల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, వీకే సింగ్, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆరోగ్యం సహకరించక పోవడంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని వేముల ప్రశాంత్‌రెడ్డి గడ్కరీకి చెప్పగా ఆయన త్వరగా కోలుకోవాలని గడ్కరీ ఆకాంక్షించారు. కేసీఆర్ ఢిల్లీ వచ్చినప్పుడు తాను భేటీ అవుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా గడ్కరీ రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన, చేపడుతున్న రోడ్ల నిర్మాణ వివరాలను... ఇందుకోసం కేటాయించిన నిధుల లెక్కలను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment