హత్రాస్: నిందితుల తరఫున ప్రముఖ న్యాయవాది‌ | lawyer AP Singh defend Hathras case accused | Sakshi
Sakshi News home page

హత్రాస్: నిందితుల తరఫున ప్రముఖ న్యాయవాది‌

Published Mon, Oct 5 2020 8:35 PM | Last Updated on Mon, Oct 5 2020 8:57 PM

lawyer AP Singh defend Hathras case accused - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార, హత్య ఉదంతంపై నిందితుల తరఫున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాది అజయ్‌ ప్రకాశ్‌ సింగ్‌ (ఏపీ సింగ్‌) మరోసారి అదే తరహా కేసునే ఎంచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఓ దళిత బాలికపై హత్యాచారానికి ఒడిగట్టి ఆమె మరణానికి కారణమైన మానవ మృగాల తరఫున వాదించేందుకు సిద్ధమయ్యారు. నలుగురు నిందితులను రక్షించేందుకు వకాల్తా పుచ్చుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హత్రాస్‌ ఘటనలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు యువకుల తరఫున ప్రమున న్యాయవాది ఏపీ సింగ్‌ వాదనలు వినిపిస్తారని పేర్కొంది. తమ విజ్ఞప్తిని మన్నించి అమాయకులైన ఠాకూర్‌ యువకులను రక్షించేందుకు ముందుకొచ్చిన ఏపీ సింగ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొంది. (హాథ్రస్‌ ఘటన: అంతా ఆ నలుగురి వైపే)

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కొంతమంది తమ వర్గానికి చెందిన యువకులను ఈ కేసులో ఇరికించేందుకు కుట్రపన్నుతున్నారని, దాని నుంచి వారిని కాపాడేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కాగా అఖిల భారతీయ క్షత్రియ మహాసభ చైర్మన్‌గా కేంద్ర మాజీమంత్రి రాజా మానవేంద్ర సింగ్‌‌ ప్రస్తుతం ఆ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. ఈ కేసు నిమిత్తం న్యాయవాదికి అయ్యే ఖర్చును తమ సంఘమే భరిస్తుందని తెలిపారు. దీని కోసం పెద్ద ఎత్తున చందాలను సైతం వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఏపీ సింగ్‌కు అప్పగించామని వెల్లడించారు. క్రిమినల్‌ న్యాయవాదిగా మంచి పేరును సింగ్‌.. అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన నిర్భయ దోషులను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అనేక వాయిదాల అనంతరం నలుగురు దోషులు ముఖేష్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ ఠాకూర్‌లను ఉరితీశారు.

మరోవైపు నిర్భయ కేసులో బాధితురాలి పక్షాన వాదనలు వినిపించి.. దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా సమృద్ధి ఖుష్వహ హత్రాస్‌ బాధితురాలి తరఫున వాదించేందుకు ముందుకొచ్చారు. నిర్భయ కేసులో ఉన్నట్లే హాథ్రస్‌ ఘటనలోనూ నలుగురు నిందితులు ఉన్నారు. అయితే నిర్భయ కేసులో నిందితులకు మద్దతు లేదు. కానీ హత్రాస్‌‌ ఘటనలో అంతా ఆ నలుగురి వైపే ఉన్నారు. ఆమెపై దాడి మాత్రమే జరిగింది. అత్యాచారం జరగలేదు అని అడిషనల్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ అంటున్నారు. ‘పోలీసులు ఆమె తల్లిదండ్రులకు చెప్పిన తర్వాతే మృతదేహాన్ని దహనం చేశారు’ అని జిల్లా మేజిస్ట్రేట్ ఇదివరకే సెలవిచ్చారు.

జిల్లా ఎస్పీ, మిగతా పోలీస్‌ అధికారులు హత్రాస్‌‌ మాటే ఎత్తడానికి లేదన్నట్లుగా ప్రతిపక్ష నేతల్ని, స్వచ్ఛంద సంఘాల వాళ్లను, మీడియాను బుల్గడీ గ్రామంలోకి కాదు కదా, అసలు హాథ్రస్‌లోకే అడుగు పెట్టనివ్వ లేదు. బాధితురాలి వైపు కాకుండా, ప్రస్తుతం పోలీస్‌ కస్టడీలో ఉన్న ఆ నలుగురు నిందితుల వైపు యావత్‌ జిల్లా పోలీస్, అధికార యంత్రాంగం పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా నిందితుల తరఫును పేరున్న సీనియర్‌ న్యాయవాది ఏపీ సింగ్‌ వాదిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సీమ ఈ కేసును ఎదుర్కోవడం సవాలు లాంటింది. అయితే నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడినట్లే తమ కుమార్తెను బలితీసుకున్న దోషులకు సైతం మరణశిక్ష పడుతుందని బాలిక తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement