
వలలో చిక్కుకున్న చిరుతపులి
సాక్షి, భువనేశ్వర్: గంజాం జిల్లా దక్షయ ఘముసర అటవీ డివిజన్ బుగుడా రేంజ్ పరిధిలోని నగురు గ్రామ శివారులో గ్రామస్తులు అడవి పందుల కోసం వేసిన వలలో గురువారం చిరుతపులి చిక్కుకుంది. సమాచారం అందుకున్న దక్షయ ఘముసర అటవీ డివిజన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుతపులిని అధీనంలోకి తీసుకొన్నారు. వెటర్నరీ వైద్యుల సాయంతో చికిత్స అందించారు. అయితే చిరుతపులి తీవ్ర అనారోగ్యంతో శుక్రువారం మృతి చెందిందని అటవీశాఖ డివిజనల్ అధికారి సత్యనారాయణ బౌరా తెలిపారు. సుమారు ఏడాదిన్నర వయస్సున్న ఈ జీవాన్ని నిబంధనల ప్రకారం ఘుమసరా అటవీ ప్రాంతంలో పూడ్చినట్లు వెల్లడించారు.