
అయోధ్యలో నూతనంగా నిర్మితమైన రామాలయంలో జనవరి 22న బాలరాముడు కొలువుదీరనున్నాడు. ఆ రోజున దేశవ్యాప్తంగా పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే దేశంలోని 10 ప్రముఖ రామాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అయోధ్య రామ మందిరం (ఉత్తరప్రదేశ్)
ఈ ఆలయ గొప్పదనం జగద్విదితం. అయోధ్యను రామజన్మభూమి అని అంటారు. ఇది సరయూ నది ఒడ్డున ఉంది. శ్రీరాముని దర్శనం కోసం ప్రతి ఏటా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు.
త్రిప్రయార్ శ్రీరామ దేవాలయం (కేరళ)
ఈ ఆలయం కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కొలువైన శ్రీరాముని విగ్రహాన్ని శ్రీకృష్ణుడు పూజించాడని చెబుతారు. కేరళలోని చెట్టువా ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడంటారు. తరువాతి కాలంలో ఆ ప్రాంత పాలకుడు వక్కయిల్ కైమల్ ఆ విగ్రహాన్ని త్రిపయార్ ఆలయంలో ప్రతిష్టించాడు. ఇక్కడికి వచ్చిన భక్తుడు దుష్టశక్తుల నుండి విముక్తి పొందుతాడని భక్తులు నమ్ముతారు.
కాలారామ్ ఆలయం (నాసిక్)
మహారాష్ట్రలోని నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో కాలారామ్ ఆలయం ఉంది. ఇక్కడ రెండు అడుగుల ఎత్తయిన రాముడి నల్లని విగ్రహం కనిపిస్తుంది. సీత, లక్ష్మణుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాన్ని సర్దార్ రంగారు ఒదేకర్ నిర్మించారు. గోదావరి నదిలో రాముని నల్లని విగ్రహం ఉన్నట్లు అతనికి కల వచ్చింది. దీంతో ఆయన మరుసటి రోజు ఆ విగ్రహాన్ని వెలికి తీయించి ఆలయాన్ని నిర్మించారు.
సీతా రామచంద్రస్వామి ఆలయం (తెలంగాణ)
ఈ ఆలయం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో ఉంది. లంక నుండి సీతామాతను తీసుకువచ్చే క్రమంలో.. శ్రీరాముడు గోదావరి నదిని దాటిన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఆలయంలోని శ్రీరాముని విగ్రహం విల్లు, బాణాలతో కూడివుంటుంది. చేతిలో కమలం పట్టుకున్న సీతామాత శ్రీరాముని పక్కన నిలుచుని ఉంటారు.
రామరాజ దేవాలయం (మధ్యప్రదేశ్)
ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో ఉంది. భారతదేశంలో శ్రీరాముని దేవునిగా కాకుండా రాజుగా పూజించే ఏకైక ఆలయం రామరాజ ఆలయం. ఇక్కడ ప్రతిరోజూ శ్రీరామునికి ఆయుధ వందనం చేస్తుంటారు.
కనక్ భవన్ ఆలయం (అయోధ్య)
అయోధ్య రాముని జన్మస్థలం. ఇక్కడే ఉన్న కనక్ భవన్ ప్రముఖ రామాలయాల్లో ఒకటిగా పరిగణిస్తుంటారు. ఆలయంలోని బంగారు సింహాసనాలపై ఆభరణాలతో అలంకృతమైన సీతారాములు ఉన్న కారణంగా ఈ ఆలయానికి కనక్ భవన్ ఆలయం అనే పేరు వచ్చింది. సూర్యుడు ఉదయించినప్పుడు ఆలయ గోడలు అద్భుతంగా కనిపిస్తాయి.
శ్రీ రామ తీర్థ మందిర్ (అమృత్సర్)
ఈ ఆలయం పంజాబ్‌లోని అమృత్సర్‌లో ఉంది. లంక నుండి వచ్చిన తరువాత సీతామాతను శ్రీరాముడు విడిచిపెట్టినప్పుడు, ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. ఈ ఆలయం అదే స్థలంలో నిర్మితమయ్యిందని చెబుతారు. ఇక్కడే సీతామాత కవలలకు జన్మనిచ్చిందని అంటారు.
కొందండ రామస్వామి దేవాలయం (చిక్కమగళూరు)
ఈ ఆలయం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఉంది. హిరమగళూరులో పరశురాముడు.. శ్రీరాముని వివాహ దృశ్యాలను చూపించమని ఆయనను అభ్యర్థించాడట. దీనికి ప్రతిగా కోదండరామస్వామి ఆలయంలోని విగ్రహాలు హిందూ వివాహ అలంకారంలో కనిపిస్తాయి. రాముడు, లక్ష్మణునికి కుడి వైపున సీతామాత నిలుచునివున్న ఏకైక ఆలయం ఇదే.
రామస్వామి దేవాలయం (తమిళనాడు)
రామస్వామి దేవాలయం తమిళనాడులో ఉంది. రామస్వామి ఆలయాన్ని దక్షిణ భారతదేశంలోని అయోధ్య అంటారు. భరతుడు, శత్రుఘ్నునితో పాటు రాముడు, సీత, లక్ష్మణ విగ్రహాలు ప్రతిష్ఠితమైన ఏకైక ఆలయం ఇదే.
రఘునాథ్ ఆలయం (జమ్మూ)
ఈ ఆలయం జమ్మూలో ఉంది. ఇది ప్రసిద్ధ దేవాలయం. ఈ ఆలయ సముదాయంలో దాదాపు ఏడు ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ హిందూ మతంలోని ఇతర దేవతలకు కూడా పూజలు జరుగుతుంటాయి. ఈ ఆలయం మొఘలల నిర్మాణ శైలిలో ఉంటుంది.