నిర్మల వ్యాఖ్యలతో ఎన్నికల వ్యయంపై చర్చ
అంత డబ్బు తన వద్ద లేదన్న కేంద్ర మంత్రి
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు వేర్వేరు పరిమితులు
పాటించకుంటే అభ్యర్థులపై అనర్హత వేటే
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన డబ్బులు తన వద్ద లేవని, అందుకే పోటీకి దూరంగా ఉంటున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన ప్రకటన సంచలనమైంది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆమె గతంలోనూ లోక్‌సభకు పోటీ చేయలేదు. అందుకు బాగా ధన బలం కావాలని తన వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పారు. దాంతో ఎన్నికల వ్యయం మరోసారి చర్చనీయాంశంగా మారింది...
2016లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన నిర్మల 2014 నుంచి 2016 దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. గత రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె తన నికర ఆస్తుల విలువను రూ.2.5 కోట్లుగా ప్రకటించారు. అయినా ఎన్నికల్లో పోటీకి సరిపడా డబ్బుల్లేవని స్వయంగా దేశ ఆర్థిక మంత్రే అనడంతో అసలు ఒక అభ్యరి్థకి ఎంత డబ్బుండాలన్నది ఆసక్తికరంగా మారింది.
ఎంత కావాలి?
ఎన్నికల ప్రచారానికి పార్టీలు ఎంతయినా ఖర్చు పెట్టొచ్చు. వాటికి పరిమితులేమీ లేవు. కానీ అభ్యర్థులు చేసే వ్యయాలకు మాత్రం పరిమితులున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఒక అభ్యర్థి రూ.95 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదు. అసెంబ్లీ ఎన్నికల్లో గరిష్ట వ్యయ పరిమితి రూ.40 లక్షలు. కేంద్రపాలిత ప్రాంతాలు, చిన్న రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు రూ.75 లక్షలు, అసెంబ్లీకి రూ.28 లక్షల పరిమితిని కేంద్ర ఎన్నికల సంఘం విధించింది.
పరిమితి దాటితే..?
ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అయితే 30 రోజుల్లోపు, లోక్‌సభ ఎన్నికలు అయితే 90 రోజుల్లోపు వ్యయాలకు సంబంధించిన అన్ని ఆధారాలను అభ్యర్థులు ఎన్నికల అధికారులకు అందించాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10ఏ కింద అభ్యరి్థని మూడేళ్ల పాటు అనర్హుడిగా ప్రకటిస్తారు. ఈసీ నిర్ణయించిన పరిమితికి మించి ఎవరైనా ఖర్చు చేసినట్టయితే వారికి వ్యతిరేకంగా ఎవరైనా ఈసీ ముందు పిటిషన్ దాఖలు చేయవచ్చు. పరిమితికి మించి ఖర్చు చేయడాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(6) కింద అవినీతి చర్యగా ఈసీ పరిగణిస్తుంది. అలాంటప్పుడు సెక్షన్ 10ఏ కింద సదరు అభ్యరి్థపై మూడేళ్లపాటు అనర్హత వేటు పడుతుంది.
ఈ ఎన్నికల వ్యయం రూ.లక్ష కోట్ల పై మాటే!
2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రూ.1,264 కోట్లు ఖర్చు చేసినట్టు నాడు బీజేపీ ప్రకటించగా, కాంగ్రెస్ వ్యయం రూ.820 కోట్లుగా ఉంది. వాస్తవానికి ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పారీ్టలు, అభ్యర్థులు చేసిన ఖర్చు రూ.60,000 కోట్లు దాటి ఉంటుందని సెంటర్ ఫర్ మీడియా సరీ్వసెస్ (సీఎంఎస్) అధ్యయనం పేర్కొంది! ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇది ఏకంగా రూ.1.2 లక్షల కోట్లకు చేరుతుందని సంస్థ అంచనా. అంటే ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి సగటున రూ.221 కోట్లు!
ఎందుకు పరిమితి?
ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచే అవకాశాలు అందరికీ సమానంగా కలి్పంచాలన్నదే వ్యయ పరిమితుల్లోని ఉద్దేశ్యం. తద్వారా ధన బలం కలిగిన అభ్యర్థులది పైచేయి కాకుండా ఉంటుంది. నామినేషన్ వేసినప్పటి నుంచి, పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థి చేసే వ్యయాలను ఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. అభ్యర్థుల బ్యాంక్ లావాదేవీలను, ఖాతాస్టేట్‌మెంట్లను ఈసీ పరిశీలిస్తుంది. వ్యయాలపై ఎన్నికల పరిశీలకుల నిఘా కూడా ఉంటుంది.
ఈసీ గైడ్‌లైన్స్ ఇవీ..
ఎన్నికల వ్యయ పరిమితి అభ్యర్థి ప్రచారానికి సంబంధించినది. ఓటర్లకు చేరువయ్యేందుకు చేసే ఖర్చు ఆ పరిమితిని మించరాదు. ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, ప్రచారం, సభలు, సమావేశాలు, వాహనాల వినియోగం వంటివన్నీ ఇందులోకి వస్తాయి. ద్రవ్యోల్బణం, పెరిగిన ప్రచార ఖర్చు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎన్నికల వ్యయ పరిమితులను ఈసీ ఎప్పటికప్పుడు సవరిస్తుంటుంది. నియోజకవర్గంలో పెరిగిన ఓటర్ల సంఖ్యను కూడా పరిశీలనలోకి తీసుకుంటుంది. ఎన్నికల వ్యయ పరిమితిని చివరిసారి 2022లో సవరించింది.
తొలుత తక్కువే
1952 తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యరి్థకి రూ.25వేల ఖర్చుకే అనుమతించారు. చిన్న రాష్ట్రాల్లోనైతే రూ.10 వేలే. తర్వాత దీన్ని సవరిస్తూ వచ్చారు. చట్టబద్ధమైన వ్యయ పరిమితితో పోలిస్తే, ఒక్కో అభ్యర్థి చేసే వాస్తవ ఖర్చు కోట్లలో ఉంటుందన్నది తెలిసిందే. వందలాది కోట్లు ఖర్చు చేసేవాళ్లూ ఉన్నారు. నగదు, ఇతర కానుకల రూపంలోనూ ఓటర్లను ప్రలోభపెడుతుంటారు. ఇదంతా అనధికారికంగా నడిచే వ్యవహారం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment