మధ్యాహ్నం 2 గంటలకు వివాహ సుముహూర్తం. వధువు నుదుటిపై జీలకర్ర బెల్లం పెట్టాల్సిన వరుడు కంగారుగా పోలింగ్ స్టేషన్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతడిని కొందరు అనుసరిస్తున్నారు. అక్కడున్న వారికి అతడు కొత్త పెళ్లి కొడుకు అని తెలుస్తోంది. అయినా కానీ, ఏంటా! అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెళ్లి ఎవరికైనా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ విషయం అతడికీ తెలుసు.
కానీ, పెళ్లితోపాటు, ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని భావించడమే ఈ వరుడి ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వదార్‌పుర ప్రాంతంలో కనిపించింది ఈ దృశ్యం. రెండో దశలో భాగంగా మహారాష్ట్రలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. షేర్వాణీ, తలపాగా ధరించిన నవ వరుడు ఆకాశ్‌ను పోలింగ్ స్టేషన్ ముందు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పలకరించింది. అతడు తన ఓటింగ్ కార్డు చూపిస్తూ, ఓటు వేసేందుకు వచి్చనట్టు చెప్పాడు. తల్లితోపాటు, మామయ్య అతడి వెంట ఉన్నాడు.
‘‘పెళ్లి వేడుక ముఖ్యమే. మరి ఓటు?. మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి’’అని ఆకాశ్ చెప్పడంతో తోటి ఓటర్లు శభాష్ అని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరగా, యూజర్లు ఎవరికి తోచిన తీరులో వారు స్పందిస్తున్నారు. ఓటు విలువను గుర్తు చేసిన ఆకాశ్‌ను అభినందిస్తున్నారు. మరొకరు అయితే.. కాబోయే వధువు
ఆలోచనల్లో తేలిపోతూ ఓటును విస్మరించేవారేమో!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment