విజయ ప్రకాశ్ కొండేకర్. తెల్లగడ్డం, తెల్లని దోతీ, భుజంపై కండువా, ఒంటిపై అంగి కూడా లేకుండా కనిపిస్తాడు. కానీ పట్టు వదలని విక్రమార్కుడనే పదబంధానికి నిలువెత్తు రూపం. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఈయన స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ దాకా ఇప్పటికి ఏకంగా 25 సార్లు పోటీ చేశారు. దశాబ్దాలుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి 1980ల్లో రిటైరయ్యారు.
‘బూటు గుర్తునే గెలిపించండి’ అని రాసున్న ప్లకార్డును ఓ బండిపై పెట్టుకుని కాలినడకన ప్రచారం చేస్తుంటారు. నగర వీధుల్లో అతడిని కొందరు పట్టించుకోకుండా వెళ్తే మరి కొందరు సెలీ్ఫలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో ఉచితంగా ప్రచారం దొరికిందంటూ సంతోషిస్తారాయన. గెలిచే అవకాశం లేదని తెలిసినా ప్రచారం కోసం పూరీ్వకుల భూమి, ఇల్లు అమ్మేశాడు. ఎప్పటికైనా ప్రధాని కావాలన్నది ఆయన కలట. దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్ని సార్లైనా పోటీ చేస్తూనే ఉంటానంటారు కొండేకర్.
ఆయన కంటే ఘనుడు మరొకరున్నారు. ఆయనే కె.పద్మరాజన్. గిన్నిస్ రికార్డు కోసం 170 కంటే ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీపైనే బరిలో దిగారు! అలాగే యూపీలోని ఆగ్రా జిల్లాకు చెందిన 78 ఏళ్ల హస్నురామ్ అంబేద్కరి ఇప్పటిదాకా ఏకంగా 98సార్లు ఎన్నికల్లో తలపడ్డారు. ఈసారి కూడా ఆగ్రా, ఫతేపుర్‌సిక్రీ స్థానాల్లో నామినేషన్ వేస్తున్నారు. ఆ రెండింట్లోనూ ఓడి సెంచరీ కొడతారట! ‘నీ భార్యే నీకు ఓటేయదు. ఇతరులెలా వేస్తారు’ అంటూ ఓ బీఎస్పీ నేత అవమానించడంతో విజయం కోసం కాకుండా ఓట్ల కోసం ఆయన ఇలా పోటీ చేస్తూనే ఉన్నారు!!
Comments
Please login to add a commentAdd a comment