![Maharashtra: 10 Test Covid Positive Ahead Of Vidhan Sabha Winter Session - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/22/coronaaaa.jpg.webp?itok=5krUorU7)
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి వ్యాప్తి దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందనుకున్న కోవిడ్.. ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మళ్లీ పంజా విసురుతోంది. 54 ఒమిక్రాన్ కేసులతో మహారాష్ట్ర దేశంలోనే రెండో స్థానంలో ఉంది. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పది మందికి కోవిడ్ నిర్ధారణ అవ్వడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానునున్నాయి. ఈ క్రమంలో సమావేశాలకు ముందు దాదాపు 3,500 మందికి ఆర్టీపీసీఆర్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు.
చదవండి: ఒమిక్రాన్ అప్‌డేట్స్.. రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు..
వీరిలో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ సోకిన వారిలో ఎనిమిది మంది పోలీసులతోపాటు ఇద్దరు అసెంబ్లీ సిబ్బంది ఉన్నారు. అయితే ఏ జర్నలిస్ట్ గానీ, ఎమ్మెల్యేల గానీ కోవిడ్ బారిన పడలేదు. కాగా పది కరోనా కేసులు వెలుగుచూడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరింత పటిష్టంగా వైద్య పరీక్షలు నిర్వహించి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాటు చేయనున్నారు.
చదవండి: ఎన్నికల సంస్కరణలకు రాజ్యసభలోనూ ఆమోదం
స్పీకర్ రేసులో సంగ్రామ్ థోపటే
మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత నానా పటోలే అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి స్పీకర్ స్థానం ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ను ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, మహావికాస్ ఆఘాడి కూటమి ఒప్పందంలో భాగంగా స్పీకర్ పదవిని కాంగ్రెస్‌కే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ పార్టీ నేత, భోర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సంగ్రామ్ థోపటే స్పీకర్ రేసులో ఉన్నారు. మరోవైపు, నిన్న మొన్నటి వరకు స్పీకర్ ఎన్నిక గురించి నోరు విప్పని బీజేపీ.. ఇప్పుడు తమ అభ్యర్థిని కూడా స్పీకర్ ఎన్నిక బరిలో దింపుతామని స్పష్టం చేసింది.
ఈ మేరకు ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ప్రకటన చేశారు. దీంతో స్పీకర్ ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే, రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 మంది ఎమ్మెల్యేలుండగా, అందులో మహావికాస్ ఆఘాడి కూటమికి చెందినవారు 170 మంది ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు 106 మంది ఉన్నారు. ఈ క్రమంలో సంఖ్యా బలం దృష్ట్యా చూస్తే స్పీకర్ పదవి మహావికాస్ ఆఘాడి కూటమికి చెందిన అభ్యర్థికే దక్కే అవకాశమే కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment