
పార్లమెంట్‌లో అనుచిత వ్యాఖ్య చేసిన టీఎంసీ ఎంపీ మహువా..
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా క్షమాపణలు చెప్పేదే లే అంటున్నారు. మంగళవారం బడ్జెట్ సెషన్‌లో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతున్న సమయంలో.. మెహువా లేచినిలబడి బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు.
దీనిపై పెను దుమారమే రేగింది. బీజేపీ ఎంపీలు ఆమె వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. అయితే వివరణాత్మక క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌పై ఎంపీ మహువా మోయిత్రా తీవ్రంగా స్పందించారు. అసలు క్షమాపణలు ఎందుకు చెప్పాలని ఆమె ఎదురు ప్రశ్నిస్తున్నారు.
యాపిల్‌ను యాపిల్ అనే అన్నాను. అందులో తప్పేం ఉంది. నేను ఏదైతే అన్నానో.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా అని బుధవారం పార్లమెంట్ బయట మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారామె. సారీనా? ఎందుకు చెప్పాలి?. గతంలో ఇదే పెద్దమనిషి(రమేశ్ బిదూరిని ఉద్దేశించి) రైతులను వ్యభిచార గృహాల నిర్వాకులని వ్యాఖ్యానించాడు. అది పార్లమెంట్ రికార్డుల్లోనూ ఉంది. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాను.
Mahua Moitra using cuss word like “harami” in Parliament And Brut won’t show this 😀
— Rishi Bagree (@rishibagree) February 7, 2023
pic.twitter.com/y8gMNXTR3i
బీజేపీకి చెందిన గౌరవనీయులైన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిగారూ రాజ్యసభలో.. డాక్టర్ శాంతనూ సేన్‌ను ఉద్దేశించి అభ్యంతరకర పదం వాడారు. అయినా పార్లమెంట్‌లో ఇలాంటి పదాలు ఉపయోగించడం కొత్తేం కాదు కదా. ఒక మహిళ అయి ఉండి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు వాళ్లు. మంచిగా తిరిగి ఇవ్వడానికి నేను పురుషుడినే కావాలా ఏంటి?. అయినా.. బీజేపీ వాళ్లు పార్లమెంటరీ మర్యాదలు బోధించడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారామె.
ఇదిలా ఉంటే మెహువా వ్యాఖ్యలపై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఎంసీ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ హేమా మాలిని సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుకను అదుపులో ఉంచుకోవాలని. భావోద్వేగంలో ఏది పడితే అది మాట్లాడొద్దని.. పార్లమెంట్‌లో సభ్యులకు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని హేమమాలిని వ్యాఖ్యానించారు.