
ఇంఫాల్: మణిపూర్‌లోని కాంగ్‌పోక్పిలో జాతీయ రహదారులపై కుకీలు తిరిగి నిరవధిక దిగ్బంధనం చేపట్టారు. రాష్ట్రంలోని కొండప్రాంతాల్లో నివాసం ఉంటున్న తమకు నిత్యవసరాలను సరిపడా అందజేయాలంటూ కుకీలకు చెందిన సదర్ హిల్స్ ట్రైబల్ యూనిటీ కమిటీ(సీవోటీయూ) డిమాండ్ చేసింది. నాగాలాండ్‌లోని దిమాపూర్‌ను ఇంఫాల్‌తో కలిపే రెండో నంబర్ జాతీయ రహదారితోపాటు ఇంఫాల్‌తో అస్సాంలోని సిల్చార్‌ను కలిపే 37వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం కుకీలు బైఠాయించారు.
కాగా, పటిష్ట బందోబస్తు నడుమ నిత్యావసరాలతో కూడిన 163 వాహనాలు రెండో నంబర్ జాతీయ రహదారి మీదుగా ఇంఫాల్ వైపుగా వెళ్తున్నాయని పోలీసులు తెలిపారు. తమకు నిత్యావసరాలు, ఔషధాలు అందకుంటే ఈ నెల 26 నుంచి దిగ్బంధనం చేస్తామని కుకీ జో డిఫెన్స్ ఫోర్స్ హెచ్చరించింది. అల్లర్లకు సంబంధించి కుకీలపై నమోదైన కేసుల ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరుతూ కుకీ విద్యావంతులు లేఖ రాశారు.