‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తన మసులోని మాటను దేశ ప్రజల ముందు ఉంచారు. ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలంపిక్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు, దేశానికి ఘనత సాధించిపెట్టేందుకు ఒలింపిక్స్ మన ఆటగాళ్లకు మంచి అవకాశం కల్పిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
దేశ ప్రజలంతా ఒలింపిక్ ఆటగాళ్లను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ విద్యార్థులతో ముచ్చటించారు. కొద్ది రోజుల క్రితం ప్రపంచ మ్యాథ్స్ ఒలింపిక్స్ నిర్వహించామని, వీటిలో భారత విద్యార్థులు అద్భుత ప్రదర్శన చూపారన్నారు. ఇందులో మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించిందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో 100కు పైగా దేశాలకు చెందిన యువతీయువకులు పాల్గొన్నారని, ఓవరాల్‌గా మొదటి ఐదు స్థానాల్లో మన బృందం చోటు దక్కించుకుందని ప్రధాని పేర్కొన్నారు. దేశానికి కీర్తిని తీసుకువచ్చిన విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. పూణేకు చెందిన ఆదిత్య వెంకట్ గణేష్, సిద్ధార్థ్ చోప్రా, ఢిల్లీకి చెందిన అర్జున్ గుప్తా, గ్రేటర్ నోయిడాకు చెందిన కనవ్ తల్వార్, ముంబైకి చెందిన రుషిల్ మాథుర్, గౌహతికి చెందిన ఆనందో భాదురితో ప్రధాని మాట్లాడారు.
మన తల్లి కోసం, మాతృభూమి కోసం మనం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ప్రధాని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటే ప్రచారంలో మనమంతా భాగస్వాములు కావాలన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద ఒకే రోజు రెండు లక్షల మొక్కలను నాటి, సరికొత్త సృష్టించామని మోదీ చెప్పారు. దేశ ప్రజలు ఖాదీ దుస్తులను కొనుగోలు చేయాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఎవరైనా ఖాదీ దుస్తులు కొనకుంటే ఇప్పుడే కొనుగోలు చేయాలని కోరారు. ఆగస్ట్ నెల వచ్చేస్తోందని, ఇది స్వాతంత్ర్య మాసమని, ఇది విప్లవానికి గుర్తు అని, ఖాదీని కొనడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment