ఆ ‘ఐఫోన్ల’ కంపెనీలో అక్రమాలెన్నో! | Many Sins Of Apple IPhones | Sakshi
Sakshi News home page

ఆ ‘ఐఫోన్ల’ కంపెనీలో అక్రమాలెన్నో!

Published Thu, Dec 24 2020 3:03 PM | Last Updated on Thu, Dec 24 2020 4:19 PM

Many Sins Of Apple IPhones - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత ఐటీ హబ్‌గా ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరం శివారులో ఐఫోన్లను తయారు చేసే ‘విస్ట్రాన్‌ ఫెసిలిటీ’లో డిసెంబర్‌ 12వ తేదీ రాత్రి, నైట్‌ షిప్టులో పని చేస్తోన్న దాదాపు రెండు వేల మంది కార్మికులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించిన విషయం తెల్సిందే. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయాలను ధ్వంసం చేయడంతోపాటు వేలాది ఐఫోన్లు, లాప్‌ టాప్‌లను కార్మికులు ఎత్తుకెళ్లారు. వారిలో కొంత మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విధ్వంసంలో కంపెనీకి ఏడు మిలియన్‌ డాలర్ల నష్టం(దాదాపు 51 కోట్ల, 54 లక్షల రూపాయలు) వాటిల్లినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.



బెంగళూరు శివారులోని ఆ నర్సాపుర ప్లాంట్‌లో గత కొన్ని నెలలుగా వేతనాలు అతి తక్కువగా ఇస్తుండడంతో కార్మికులకు కడుపు మండి ఒక్కసారిగా కంపెనీపై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన ప్రభుత్వ బృందానికి అనేక చీకటి విషయాలు వెలుగు చూశాయి. ఐఫోన్ల ఉత్పత్తి కోసం తైవాక్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి కంపెనీలో అన్యాయాలు, అక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీలో 10,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారికి ఎక్కువ జీతాలిస్తామని చెప్పి తక్కువ జీతాలు ఇస్తూ వచ్చారు. అప్పటి వరకు 8 గంటల షిప్టుల్లో పని చేసిన ఉద్యోగులకు గత అక్టోబర్‌ నెల నుంచి 12 గంటల షిప్టులు వేశారు. త్వరలోనే హామీ ఇచ్చిన మేరకు జీతాలు పెంచుతామంటూ ఇంతకాలం కార్మికులను బుజ్జగిస్తూ వచ్చారు. ‘అదనంగా పెంచిన నాలుగు గంటలకు ఓటీ ఇస్తారా, లేదా? హామీ ఇచ్చిన మేరకు జీతాలు పెంచి 12 గంటలు పని చేయించుకోవాలనుకుంటున్నారా?’ అన్న ఆలోచన, ఆందోళన ఉద్యోగుల్లో పెరిగింది. ఇంజనీరింగ్‌ గ్రాడ్యువేట్లకు నెలకు 21 వేల రూపాయలు ఇస్తామని విస్ట్రాన్‌ కంపెనీ యాజమాన్యం ఉద్యోగులకు హామీ ఇచ్చింది. అయితే వారికి నెలకు 16 వేల రూపాయలే ఇస్తున్నట్లు ప్రభుత్వ నివేదిక తెలిపింది.

కార్మిక శాఖ నుంచి అనుమతి లేదు
కంపెనీ 12 గంటల షిప్టు గురించి కర్ణాటక కార్మిక శాఖకు తెలియజేయలేదు. మహిళా కార్మికుల అదనపు పని గంటల విషయంలో ముందుగా కర్ణాటక కార్మిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి, అదీ తీసుకోలేదు. కాంట్రాక్టు కార్మికులు, హైజ్‌ కీపింగ్‌ స్టాఫ్‌తో అదనపు గంటలు పని చేయించుకోవడంతోపాటు వారి అటెండెన్స్‌ను సక్రమంగా నమోదు చేయాల్సిన కంపెనీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా తప్పుడు విధానంతో తగ్గించింది. ఉద్యోగుల విధ్వంసం నేపథ్యంలో కంపెనీని సందర్శించాక ప్రభుత్వ దర్యాప్తు బృందానికి కంపెనీ యాజమాన్యం బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఉద్యోగుల వేతనాల్లో జరిగిన అక్రమాలను సరిదిద్దుతామని హామీ ఇచ్చింది. భారత్‌లో వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్న కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ను ఉద్యోగంలో తీసివేసినట్లు పేర్కొంది. ఉద్యోగుల ఫిర్యాదులను స్వీకరించేందుకు హాట్‌లైన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది.

విస్ట్రాన్‌ కంపెనీ నర్సాపురలో 43 ఎకరాల్లో మూడువేల కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీని నిర్మించింది. రెండో తరానికి చెందిన ఐఫోన్‌ ఎసీఈ మోడల్‌తోపాటు నాలుగు మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. వీటిని భారత్‌లో విక్రయించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫ్యాక్టరీ విస్తరణ కోసం 1300 కోట్ల రూపాయలను పక్కన పెట్టింది. ప్రస్తుతం పదివేల మంది ఉద్యోగుల్లో రెండు వేల మంది మాత్రమే కంపెనీ ‘రోల్స్‌’లో పని చేస్తున్నారు. మిగతా వారంతా కాంట్రాక్ట్‌పై పని చేస్తున్నారు. రానున్న కాలంలో ఉద్యోగుల సంఖ్యను 20 వేలకు పెంచుతామని కంపెనీ యాజమాన్యం ఇది వరకే ప్రకటించింది. అయితే ఈ విధ్వంస సంఘటన నేపథ్యంలో కంపెనీ విస్తరణ ఆలస్యం అవుతుందని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి. 

కార్మికుల ఆత్మహత్యలు
అమెరికాకు చెందిన ఐఫోన్ల దిగ్గజ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీలకు ఉత్పత్తి కాంట్రాక్టులిచ్చింది. అలా కాంట్రాక్టు తీసుకున్న పలు కంపెనీలు కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడడమే కాకుండా, వారి ప్రాణాలు తీస్తున్నా, వాటిని అరికట్టేందుకు అమెరికా కంపెనీ ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదో అర్థం కాదు. చైనాలోని షెన్‌జెన్‌ నగరంలో ఐఫోన్ల కాంట్రాక్టు తీసుకున్న నైట్‌లైన్‌ కంపెనీలో 18, 24 గంటల షిప్టులను తట్టుకోలేక 2012, ఏప్రిల్‌ నెలలో 18 మంది కార్మికులు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు.  కార్మికుల ఆత్మహత్యలను అడ్డుకోవడానికి ఆ కంపెనీ ఇనుప వలలను ఏర్పాటు చేయడం మరీ చిత్రం. జెంగ్జౌ నగరంలోని ఐఫోన్లను ఉత్పత్తి చేసే ఫాక్స్‌కాన్‌ కంపెనీలో 2018, జనవరి ముగ్గురు కార్మికులు పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement