లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ ఆధారంగా నమోదు
ముడా ప్లాట్ల కేటాయింపులో మనీలాండరింగ్ కేసు
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని లోకాయుక్త నమోదు చేసిన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) ఆధారంగా ఈ చర్యకు దిగింది.
సిద్ధరామయ్య, భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి తదితరులపై కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. పార్వతి నుంచి 3.16 ఎకరాలను సేకరించిన ముడా ప్రతిగా 50:50 నిష్పత్తిలో ఖరీదైన ప్రాంతంలో ఆమెకు 14 ప్లాట్లను కేటాయించింది. దీంట్లో అవినీతి, అధికార దురి్వనియోగం జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్‌చంద్ గెçహ్లాట్ అనుమతి మంజూరు చేశారు.
దీన్ని సిద్ధూ హైకోర్టులో సవాల్ చేసినా చుక్కెదురైంది. అనంతరం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై లోకాయుక్త పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దాని ఆధారంగా సిద్ధరామయ్య తదితరులపై ఈడీ సోమవారం కేసు నమోదు చేసింది. విచారణకు రావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసే వీలుంది. అలాగే ఆస్తులను కూడా అటాచ్ చేయవచ్చు.
14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తా
ముడా కమిషనర్‌కు పార్వతి లేఖ
మైసూరు: భూపరిహారంగా ముడా తనకు కేటాయించిన 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేందుకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి ముందుకు వచ్చారు. ఈ మేరకు ముడా కమిషనర్‌కు సోమవారం ఆమె లేఖ రాశారు. మైసూరు కేసరే గ్రామంలో తనకు చెందిన 3.16 ఎకరాల భూమిని ముడా తీసుకొని.. విజయనగర లేఔట్ ఫేజ్–3, ఫేజ్–4లో తనకు 14 ప్లాట్లను కేటాయించిందని ఆమె వివరించారు.
‘సేల్ డీడ్‌ను రద్దు చేయడం ద్వారా నేనీ 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముడా ఈ ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ దిశగా సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పార్వతి ముడా కమిషనర్‌ను కోరారు. ముడా కేటాయింపుల్లో సిద్ధరామయ్యపై దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, లోకాయుక్త పోలీసుల కేసు నమోదు, తాజాగా సోమవారం ఈడీ కేసు నమోదు నేపథ్యంలో.. ప్లాట్లను తిరిగి ఇచ్చేయాలని పార్వతి నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment