సాక్షి, న్యూఢిల్లీ : పెద్దల సభను హుందాతనానికి ప్రతీకగా మలిచే క్రమంలో రాజ్యసభ ఎథిక్స్ కమిటీని మరింత బలోపేతం చేశారు. ఎంపీల ప్రవర్తనపై వచ్చే ఫిర్యాదులను నేరుగా స్వీకరించేందుకు ఇద్దరు ఉన్నతాధికారులకు అధికారాలను కట్టబెట్టారు. ఎథిక్స్ కమిటీ మరింత బాగా పనిచేసేలా పలు చర్యలు చేపట్టాలని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నిర్ణయించారు. పెద్దల సభలో ఎంపీలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థను ఏర్పాటు చేయడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాజ్యసభ సభ్యులకు 14 సూత్రాల ప్రవర్తనా నియమావళిని నిర్ధేశిస్తూ పార్లమెంటు గౌరవాన్ని భంగం కలిగించేలా ఎంపీలు వ్యవహరించరాదని నియమావళిలో పొందుపరిచారు.
ప్రశ్నోత్తరాల సమయం, ఎంపీ ల్యాడ్స్ నిధులు, బ్యాంకు రుణాల ఎగవేత అంశాలపై ఎంపీలపై ఫిర్యాదులను ఎథిక్స్ కమిటీ విచారించింది. కాగా, బీజేపీ ఎంపీ శివప్రతాప్ శుక్లాను రాజ్యసభ ఎథిక్స కమిటీ చీఫ్‌గా ఇటీవల నియమితులయ్యారు. శుక్లాతో పాటు మరో ముగ్గురు ఎంపీలను ఎథిక్స్ కమిటీలో రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు నియమించిన సంగతి తెలిసిందే. వీరిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వి. విజయసాయిరెడ్డి, డీఎంకేకు చెందిన తిరుచి శివ, టీఆర్‌ఎస్ ఎంపీ కే. కేశవరావులు ఉన్నారు. దీంతో రాజ్యసభ ఎథిక్స్ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య చైర్మన్ సహా 11 మందికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment