భోపాల్: ఓ వైపు దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ.. బాధితులకు కనీసం బెడ్స్ కూడ దొరకని పరిస్థితి నెలకొనగా.. మరోవైపు వైరస్ పాజిటివ్ వచ్చిన వారు ఏ మాత్రం భయం లేకుండా.. క్వారంటైన్ నియమాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కోవిడ్ బారిన పడ్డ వ్యక్తి ఒకరు క్వారంటైన్ నియమాలు ఉల్లఘించి.. వివాహానికి హాజరయ్యాడు.
అంతటితో ఆగక పెళ్లికి వచ్చిన వారికి భోజనాలు వడ్డించాడు. దాంతో పాటు కరోనాను వ్యాప్తి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు వ్యక్తి మీద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ నివారి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. అరుణ్ మిశ్రా అనే వ్యక్తికి ఈ నెల 27న కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారించారు. దాంతో అతడిని క్వారంటైనలో ఉండాల్సిందిగా ప్రభుత్వ వైద్యులు సూచించారు.
ఈ క్రమంలో ఏప్రిల్ 29న అరుణ్ మిశ్రా బంధువుల పెళ్లి ఉంది. దాంతో అతడు తనకు కోవిడ్ సోకిందనే విషయాన్ని పక్కన పెట్టి.. వివాహానికి హాజరయ్యాడు. తనతో పాటు రంజన్ నాయక్, స్వరూప్ సింగ్ అనే మరో ఇద్దరు మిత్రులను తీసుకుని వెళ్లి వివాహానికి హాజరవ్వడమే కాక పెళ్లికి వచ్చిన వారికి విందు భోజనాలు వడ్డించారు. వివాహం తర్వాత గ్రామంలో కోవిడ్ కేసులు పెరిగాయి. దాంతో అధికారులు రంగంలోకి దిగి.. దర్యాప్తు చేయగా.. అరుణ్ మిశ్రా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కోవిడ్ అని తెలిసి కూడా క్వారంటైన్‌లో ఉండకుండా వివాహానికి హాజరవ్వడంతో పోలీసులు అరుణ్ మిశ్రాతో పాటు మిగతా ఇద్దరి స్నేహితుల మీద కేసు నమోదు చేశారు. వీరిలో అరుణ్ మిశ్రా, స్వరూప్ సింగ్‌లను పృథ్వీపూర్ లోని కోవిడ్ -19 కేర్ సెంటర్లో ఉంచగా, మూడవ నిందితుడు రంజన్ నాయక్ పరారీలో ఉన్నట్లు జెరాన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సురేంద్ర సింగ్ యాదవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment