న్యూఢిల్లీ : కరోనా విషయంలో ప్రజల్లో అప్రమత్తత స్థానంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి దాదాపుగా బయటపడ్డామని, ఈ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, మళ్లీ సమస్యను తీవ్రం చేయవద్దని సూచించారు. కరోనా సంక్షోభం అనే నడి సంద్రం నుంచి బయటపడి, తీరం వైపు వెళ్తున్నామని, అయితే, ఇప్పుడు తీరం దగ్గర పడిన సమయంలో మునిగిపోవడం సరికాదంటూ ‘నీరు తక్కువగా ఉన్న దగ్గరే మా పడవ మునిగిపోయింది’ అని అర్థం వచ్చే ఒక కవితాపాదాన్ని ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు.
కరోనా సమస్య నుంచి భారత్ బయటపడటం కష్టమని చాలా దేశాలు భావించాయన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రతినిధులతో మంగళవారం ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. కొన్ని దేశాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గి, మళీ ఒక్కసారిగా పెరిగిన విధంగానే, భారత్‌లోనూ కొన్ని రాష్ట్రాల్లో అకస్మాత్తుగా కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధిస్తూ.. పాజిటివ్ కేసుల సంఖ్యను, మరణాల రేటును తగ్గించడంపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు.
ఈ కీలక సమయంలో ఎలాంటి తప్పటడుగు వేయవద్దని అభ్యర్థించారు. కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్ధమవ్వాలని, టీకా నిల్వ, సరఫరా, పంపిణీలకు సంబంధించి మౌలిక వసతుల కల్పనపై త్వరగా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను కోరారు. దేశంలోని ప్రతీ పౌరుడికి టీకా అందేలా ప్రణాళికలను రూపొందించాలన్నారు. పలు టీకాలు తుది దశలో ఉన్నాయని, టీకాల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. దేశ ప్రజలకు టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ప్రస్తావించకుండా.. టీకాను రూపొందించడంలో వేగంతో పాటు, భద్రతకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ప్రధాని వ్యాఖ్యానించారు. భద్రతపై శాస్త్రీయంగా నిర్ధారణ అయిన తరువాతే వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని స్థాయిల్లో ప్రభుత్వాలు కలసికట్టుగా పని చేయాలని ప్రధాని సూచించారు.
‘ఎన్ని డోసుల్లో వ్యాక్సినేషన్ ఉంటుందని ఇప్పుడే చెప్పలేం. టీకా ధరను కూడా ఇంకా నిర్ణయించలేదు. వివిధ దేశాల్లో వివిధ స్థాయిల్లో టీకాను రూపొందించే కార్యక్రమం సాగుతోంది. ఇందులో ఇన్‌వాల్వ్ అయిన కార్పొరేట్ వర్గాల్లోనూ పోటీ నెలకొని ఉంది. దేశాలు తమతమ దౌత్య స్థాయిల్లో చర్చలు సాగిస్తున్నాయి. టీకా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని మోదీ వివరించారు. టీకా వల్ల దుష్పరిమాణాలు తలెత్తుతాయన్న అపోహలు ప్రచారంలోకి రావచ్చని, వాటిని సమర్ధంగా ఎదుర్కోవాలని రాష్ట్రాలకు సూచించారు. ఇందుకు పౌర సమాజం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, మీడియా.. తదితర వర్గాల సహకారం తీసుకోవాలన్నారు. రాష్ట్రాలను సంప్రదించిన తరువాత, టీకా ఇవ్వనున్న వర్గాల ప్రాధాన్యతాక్రమాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్‌లను సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలను కోరారు.
దుష్పరిణామాలపై జాగ్రత్త
వ్యాక్సినేషన్ అనంతర దుష్పరిమాణాలపై జాగ్రత్త వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు రాసిన లేఖలో కోరింది. కొన్ని ప్రాధాన్యతావర్గాలకు వ్యాక్సినేషన్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయంది. దుష్ప్రభావాలపై చర్యలు తీసుకునేందుకు వీలుగా రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో స్పెషలిస్టులు కూడా ఉండే కమిటీలను ఏర్పాటు చేయాలని కోరింది.
4 దశలు
దేశంలో కరోనా దశలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ విశ్లేషించారు. తొలి దశలో ప్రజలు ఎక్కువగా భయపడ్డారని, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. రెండో దశలో, కరోనా సోకిన వారిపై వివక్ష కనిపించిందని తెలిపారు. మూడో దశలో ఆ వివక్ష తొలగిందని, జాగ్రత్తలు తీసుకోవాలని ఇతరులకు సూచించారని ప్రధాని వివరించారు. ఈ వైరస్ ప్రమాదకారి కాదన్న భావన ప్రజల్లో ఏర్పడిందని నాలుగో దశ గురించి వివరించారు. దీనివల్ల నిర్లక్ష్యం కూడా పెరిగిందన్నారు.
సూచనలివ్వండి
వైరస్ కట్టడికి, టీకా పంపిణీకి లిఖితపూర్వకంగా సూచనలను పంపించాల్సిందిగా ప్రధాని ముఖ్యమంత్రులను కోరారు. ఇదంతా ఐక్యంగా చేయాల్సిన పని అని, ఎవరిపైనా బలవంతంగా నిర్ణయాలను రుద్దడం ఉండదని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచడం కోసం ‘పీఎం కేర్స్’ నిధులను వినియోగించుకోవాలని కోరారు. కోవిడ్–19 నియంత్రణలో ప్రధాని మోదీ నాయకత్వాన్ని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొనియాడారని, రాష్ట్రాల్లో ఆరోగ్య మౌలిక వసతుల కల్పనలో కేంద్రం అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారని ఆ తరువాత కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.
వాయు కాలుష్యం కారణంగానే ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరిగినట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ సమావేశంలో పేర్కొన్నారని సమాచారం. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ సమయంలోనూ కొన్ని పార్టీలు రోడ్లపై ఆందోళనలు చేపడుతూ ప్రజల ప్రాణాలను పణంగా పెడ్తున్నాయని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment