న్యూఢిల్లీ: కోవిడ్–19 ఇన్షెక్షన్‌తో పోలిస్తే నిఫా వైరస్‌తో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ చెప్పారు. నిఫా వైరస్ కేసుల్లో మరణాల రేటు 40 శాతం నుంచి 70 శాతం దాకా ఉంటోందన్నారు. అదే కోవిడ్‌లో అయితే 2–3 శాతం మధ్యనే ఉందని వివరించారు. కేరళలో నిఫా కేసుల్లో పెరుగుదల నమోదు అవుతుండటంతో ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీ 20 డోసులు తెప్పించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.
జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. కలుషిత ఆహారం లేక ఒకరి నుంచి మరొకరికి కూడా ఇది సోకుతుంది. నిఫా వైరస్‌తో ఇప్పటికే కేరళలో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. యాంటీబాడీ డోసుల కొనుగోలుపై రాజీవ్ బహల్ స్పందిస్తూ..ఆస్ట్రేలియా నుంచి 2018లో తెప్పించిన కొన్ని డోసులు ఇప్పటికీ ఉన్నాయనీ, అవి 10 మంది బాధితులకు మాత్రమే సరిపోతాయని వివరించారు.
భారత్ కాకుండా విదేశాల్లో ఇప్పటి వరకు 14 మందికి మాత్రమే ఈ వైరస్ సోకిందన్నారు. వీరికి మోనోక్లోనల్ యాంటీబాడీలను ఇవ్వగా అందరూ సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. ‘అయితే, ఈ యాంటీబాడీలను ప్రారంభదశలో ఉన్న వారికే వాడుతున్నారు. వీటితో చికిత్సపై నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం, వైద్యులు, వైరస్ బాధితుల కుటుంబాలకే వదిలేశాము. మోనోక్లోనల్ యాంటీబాడీలతో విదేశాల్లో భద్రతను నిర్థారించే ఫేజ్–1 ట్రయల్ మాత్రమే జరిగింది. సామర్థ్యాన్ని నిర్థారించే ట్రయల్స్ జరగలేదు. అందుకే దీనిని ‘కారుణ్య వినియోగ ఔషధం’గా మాత్రమే వాడుతున్నారు’అని రాజీవ్ వివరించారు.
చదవండి: ముగిసిన ఈడీ డైరెక్టర్ పదవీకాలం
Comments
Please login to add a commentAdd a comment