సాక్షి, భువనేశ్వర్: జీవితంలో పెళ్లి అనేది ఓ మరుపురాని సంఘటన. అదేరోజు అందరికీ గుర్తుండిపోయే ఓ మంచిపని చేస్తే అది ఇంకా ప్రత్యేకం. ఆదివారం హితేష్ అనే యువకుడి పెళ్లి జరుగుతుండగా, ఓ ఉన్నతాధికారి నుంచి రక్తదానం చేయాల్సిందిగా వరుడికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అతడు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా వధువుకి తాళికట్టిన మరుక్షణమే పెళ్లిపీఠలపై నుంచి లేచి, నేరుగా ఆస్పత్రికి వెళ్లి, రక్తదానం చేసి, ఆదర్శంగా నిలిచాడు. వివరాలిలా ఉన్నాయి.. కొరాపుట్ జిల్లాలోని బొయిపరిగుడ సమితి, మఠపడ గ్రామపంచాయతీలో ఉన్న తెంతులిపొదర్ గ్రామానికి చెందిన నిండు గర్భిణికి ఆదివారం ఉదయం పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వైద్యసేవల నిమిత్తం సహిద్ లక్ష్మణ్ నాయక్ ఆస్పత్రికి ఆమెని తరలించారు.
రక్తం కొరతతో..
ఆమెకి రక్తం తక్కువగా ఉందని, చికిత్స చేయడం కుదరదని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆమెకి కావాల్సిన గ్రూపు–ఏబీ పాజిటివ్ రక్తం కోసం చాలాచోట్ల ప్రయత్నించారు. కరోనా కారణంగా దాతలెవ్వరూ ముందుకు రాకపోవడంతో నిస్సహాయ స్థితికి చేరుకున్న వారి విషయం గురించి కొరాపుట్ డిప్యూటీ కలెక్టర్ అలోక్‌కుమార్ అనుగూలియకి తెలిసింది. దీంతో ఆయన బాధితులకు సాయం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. తనకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేసి రక్తం దానం చేయాల్సిందిగా కోరారు.
ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో చివరికి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న హితేష్‌కి ఆయన ఫోన్ చేశారు. అధికారి ఫోన్ కాల్‌కి స్పందించిన సదరు యువకుడు తనకు పెళ్లి జరుగుతోందని, తాళి కట్టి వచ్చేస్తానని సమాధానమిచ్చాడు. పెళ్లయిన వెంటనే హితేష్ ఆస్పత్రికి చేరుకుని, రక్తదానం చేసి, గర్భిణికి అండగా నిలిచాడు. కరోనా భయంతో రక్తం దానం చేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకురాని పరిస్థితుల్లో పెళ్లికొడుకు పెళ్లిమండపం నుంచి వచ్చిమరీ రక్తదానం చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గర్భిణి పరిస్థితి బాగుందని, చాలా సులభంగా డెలివరీ కూడా జరుగుతుందని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment