సాక్షి, భువనేశ్వర్: ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్ దాస్ హత్యవెనుక గల కారణాలపై రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ బృందం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి బ్రజరాజ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్(ఇన్‌చార్జి) ప్రద్యుమ్న స్వొయి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఇందులో ఘటనా క్రమంతో నిందితుల వివరాలు పేర్కొన్నారు. ఏఎస్‌ఐ గోపాల్‌కృష్ణ దాస్ హతమార్చాలనే స్పష్టమైన ఉద్దేశంతోనే మంత్రిపై కాల్పులు జరిపినట్లు ప్రాథమికంగా నమోదు చేశారు.
‘ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్ దాస్ గాంధీ చౌక్‌లోని లిఫ్ట్ అండ్ షిఫ్ట్ బిల్డింగ్‌లో బ్రజరాజ్ నగర్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఆదివారం మధ్యాహ్నం 12:15 గంటలకు విచ్చేశారు. వేదిక సమీపంలో ఆగిన కారు ముందు వైపు సిబ్బంది తలుపు తెరిచిన తర్వాత కిందికి దిగారు. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం మోహరించిన ఏఎస్‌ఐ గోపాల్ కృష్ణదాస్ వెనువెంటనే తలుపు వద్దకు వచ్చి, చంపాలనే స్పష్టమైన ఉద్దేశంతో మంత్రిని లక్ష్యంగా చేసుకుని చాలా సమీపం నుంచి తన సర్వీస్ రివాల్వర్‌తో గురిపెట్టి కాల్పులు జరిపాడు. బుల్లెట్లు మంత్రి ఛాతికి తగలడంతో ఆయన కింద పడిపోయార’ని పేర్కొన్నారు.
ఐఐసీ వేలికి గాయం..
ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన బ్రజరాజ్ నగర్ ఐఐసీ, రాంపూర్ పోలీస్ అవుట్‌పోస్ట్ కానిస్టేబుల్ కేసీ ప్రధాన్‌తో కలిసి నిందితుడు గోపాల్‌దాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి తప్పించుకునేందుకు నిందితుడు 9 ఎంఎం పిస్టల్ నుంచి మరో రెండు రౌండ్ల బుల్లెట్లను కాల్చాడు. దీంతో బ్రజరాజ్ నగర్ ఐఐసీ ప్రద్యుమ్న త్రుటిలో తప్పించుకోగా, వేలికి గాయం తగిలింది. ఈ పరిస్థితుల్లో కాళీనగర్‌కు చెందిన జీబన్‌లాల్ నాయక్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. కొంత పెనుగులాట తరువాత నిందితుడి నుంచి ఎట్టకేలకు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలతో దాఖలైన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 307, ఆయుధ చట్టంలోని 27(1) కింద కేసు నమోదు చేశారు.
50కి పైగా ప్రశ్నలు..
మీడియా ప్రతినిధులతో మాట్లాడిన క్రైమ్ బ్రాంచ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఏడీజీ) అరుణ్ బొత్రా నిందిత ఏఎస్‌ఐ గోపాల్ కృష్ణదాస్ ఆదివారం ఘటనా స్థలంలో పట్టుబడినట్లు తెలిపారు. మంత్రి నవకిషోర్ దాస్‌పై తుపాకీతో పేల్చడం వెనక పరిస్థితులను స్పష్టం చేసే దిశలో దర్యాప్తుకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు స్పష్టంచేశారు. కాల్పుల ఘటనపై తదుపరి విచారణ కోసం నిందితుడికి ఏడు రోజుల రిమాండ్ నిమిత్తం కోర్టుకు అభ్యరి్థంచనున్నట్లు వివరించారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. సుందర్‌గఢ్ పోలీసు బ్యారక్‌లో నిర్బంధించి నిందిత ఏఎస్‌ఐ గోపాల్‌దాస్‌ను నిరవధికంగా 2 గంటల పాటు ప్రశ్నించారు. 50కి పైగా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. అయితే ఆయన ఏం మాట్లా డారు? ఏం సమాధానం చెప్పాడు? ఎందుకు చంపాడనే విషయాలేవీ తెలియరాలేదు. అరుణ్ బొత్రా సైతం మీడియా ఎదుట పెదవి దాటకుండా జాగ్రత్త వహించారు.
హైకోర్టు న్యాయమూర్తితో విచారణ..
మంత్రి నవకిషోర్ దాస్ హత్య ఘనను హైకోర్టు న్యాయ మూర్తితో విచారణ జరిపించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టుకు లేఖ రాసింది. మంత్రి నవకిషోర్ దాస్ హత్యా ఘటనపై విచారణకు సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తిని పేర్కొవాలని సోమవారం రాసిన లేఖలో అభ్యర్థించింది.
ఝార్సుగుడ మున్సిపాలిటీ లో మంత్రి చివరి ప్రసంగం
నన్ను మాత్రం వదులుతారా?
ఆరోగ్యమంత్రి నవకిషోర్ దాస్ మరణానికి కొద్ది సమయం ముందు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడి ప్రసంగంతో ఆయన జీవన ప్రస్థానం ముగిసింది. ఝార్సుగుడ మున్సిపాలిటీ ఒకటో నంబరు వార్డు కిసాన్‌పాడులో మైక్రో యాక్టివిటీ సెంటర్ ప్రాంగణంలో కొత్త భవనం ప్రారంభోత్సవంలో చివరి సారిగా ప్రసంగించారు. ఈ సమావేశంలో మంత్రి అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.
‘ప్రతి చోటా ఆదరించే వారు ఉంటారు.. కించపరిచే వారూ.. ఉంటారు. రాముడు–రావణుడు, కృష్ణుడు–కంసుడు ఈ కోవకు చెందిన వార’ని ఉదహరించారు. ‘సీతారాములను కించపరచకుండా వదలని ప్రజానీకం మధ్య మనుగడ కొనసాగిస్తున్న నన్ను మాత్రం ధూషించకుండా వదులుతారా?’ అని చమత్కరించి సభలో నవ్వులు కురిపించారు. ఈ కార్యక్రమం హాజరయ్యే ముందు తుపాకీ తూటాతో కుప్పకూలి అనంత విషాదం మిగిల్చారు.
శని శింగనాపూర్ శనిదేవుని మందిరంలో మంత్రి నవకిషోర్ దాస్ పూజలు(ఫైల్)
కలిసిరాని పూజ!
త్రివేణి అమావాస్య సందర్భంగా మహారాష్ట్ర శని శింగనాపూర్‌లో ఉన్న శనిదేవుని మందిరంలో మంత్రి కిషోర్‌దాస్ బంగారు కలశం విరాళంగా అందజేసి ఇటీవల వార్తలకెక్కారు. రూ.కోటి విలువైన 700 గ్రాముల బంగారం, 5కిలోల వెండితో చేసిన కలశాన్ని ఆలయానికి సమరి్పంచారు. అయితే ఈ కలశం విలువ కేవలం రూ.10 లక్షలు మాత్రమేనని మంత్రి ప్రకటించారు. ఈ కలశం ఆవ నూనెతో శని భగవానునికి అభిషేకించేందుకు వినియోగించేందుకు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర, ఝార్సుగుడ ప్రజలను సంతోషంగా ఉంచాలని శని దేవుడిని ప్రార్థించానన్నారు.
గోపాల్ కృష్ణదాస్, ఏఎస్‌ఐ
విధుల నుంచి తొలగింపు..
ఆరోగ్యశాఖ మంత్రి కిషోర్ దాస్ హత్యకేసులో నిందితుడు సహాయ సబ్ ఇస్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఏఎస్‌ఐ) గోపాల్‌కృష్ణ దాస్‌ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విధుల నుంచి తొలగిస్తునట్లు ఝార్సుగుడ జిల్లా ఎస్పీ రాహుల్‌జైన్ సోమవారం ప్రకటించారు. నిందితుడు బ్రజరాజ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ ఛక్ అవుట్‌పోస్టు సిబ్బందిగా పేర్కొన్నారు. భారత రాజ్యంగం ఆర్టికల్ 311 ప్రకారం సరీ్వసులో ఉన్న నిందితునికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఉత్తర్వులు ఈనెల 30నుంచి అమలైనట్లు పరిగణిస్తామన్నారు.
గవర్నర్, ముఖ్యమంత్రి చివరి చూపు..
దివంగత మంత్రి నవకిషోర్ దాస్ స్థానిక యూనిట్–5 అధికారిక నివాస ప్రాంగణంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గవర్నర్ ప్రొఫెసర్ గణేష్‌లాల్ అంతిమ దర్శనం చేసుకుని పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. ఈ ప్రాంగణంలో దాస్‌కు ఒడిశా పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ ప్రదానం చేశారు. అతున్ సవ్యసాచి నాయక్, పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఉషాదేవి, న్యాయశాఖ మంత్రి జగన్నాథ్ సరకా, విద్యుత్‌శాఖ మంత్రి ప్రతాప్ కేశరీదేవ్, జల వనరులశాఖ మంత్రి టుకుని సాహు, ఎక్సైజ్‌శాఖ మంత్రి అశ్వినీకుమార్ పాత్రొ, నైపుణ్య అభివృద్ధి, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ప్రీతిరంజన్ ఘొడై, జౌళీ, హస్తకళల శాఖమంత్రి రీతా సాహు, పాఠశాలలు, సామూహిక విద్యాశాఖ మంత్రి సమీర్‌రంజన్ దాస్ ఈ ప్రాంగణంలో దివంగత మంత్రికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆరోగ్యశాఖ మంత్రి నవకిషోర్ దాస్ మరణం దురదృష్టకరమని వీరంతా విచారం వ్యక్తం చేసి, ఆయన కుటుంబీకుల పట్ల ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment