శశికళ పుష్ప, రోడ్డుపై వస్తువులు
సాక్షి, చెన్నై: మాజీ ఎంపీ శశికళ పుష్పకు సంబంధించిన అన్ని రకాల వస్తువులను ఢిల్లీ రోడ్లపై అధికారులు పడేశారు. ఆమె ప్రభుత్వ క్వార్టర్స్‌ను ఖాళీ చేయకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డారు. 2011–14లో తూత్తుకుడి కార్పొరేషన్ మేయర్ పదవితో శశికళ పుష్ప రాజకీయ తెర మీదకు వచ్చారు. ఆమెకు దివంగత సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పెద్ద పీట వేశారు. ఆ తదుపరి రాజ్యసభ సీటు కూడా అప్పగించారు.
ఈ సమయంలో ఢిల్లీలో ఆమె సాగించిన కొన్ని వ్యవహారాలను జయలలితకు ఆగ్రహాన్ని తెప్పించాయి. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివతో కలిసి ఆమె ఫొటోలు వైరల్ కావడంతో అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. అయినా, ఆ పదవిలో ఐదేళ్లు కొనసాగారు. ఇటీవల ఆమె పదవీ కాలం ముగిసింది. బీజేపీలో చేరిన ఆమెకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి కూడా దక్కింది.
ఈ పరిస్థితుల్లో పదవీ కాలం ముగిసి రెండేళ్లు అవుతున్నా, ప్రభుత్వ గృహాన్ని ఖాళీ చేయక పోవడంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు కన్నెర్ర చేశాయి. ఢిల్లీ నార్త్ అవెన్యూలోని శశికళ పుష్ప గృహాన్ని అధికారులు శుక్రవారం బలవంతంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఆమె గృహంలో ఉన్న అన్ని వస్తువులను రోడ్డు పక్కన పడేశారు. ఆ సమయంలో శశికళ పుష్ప ఢిల్లీలో లేరు.
Comments
Please login to add a commentAdd a comment