
ముంబై: దేశాన్ని కరోనా పీడ వదిలేలా లేదు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి దడ పుట్టిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని చూస్తుంటే థర్డ్ వేవ్ తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో వ్యాప్తి చెందితే ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతూ మరోసారి దేశాన్ని అతలాకుతలం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. తాజాగా మహరాష్ట్రలో రెండు, రాజస్థాన్‌లో ఒక కేసు.. నమోదు కావడంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 24 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అధికారులు తెలపిన వివరాల ప్రకారం.. సోమవారం కొత్తగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి(37), అమెరికా నుంచి వచ్చిన మరో వ్యక్తికి (36) ఈ వైరస్ సోకినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది. ( చదవండి: Karnataka-Omicron: ఒమిక్రాన్ భయాలు.. ఊరట కలిగించే వార్త చెప్పిన కర్ణాటక ‘డాక్టర్’ )
నిపుణుల అంచనాల ప్రకారం.. దేశంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గరిష్టస్థాయికి చేరవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా 60 రోజుల్లో దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దీని ప్రభావం స్వల్పంగా ఉండొచ్చని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అభిప్రాయపడ్డారు. దేశంలో లాక్‌డౌన్ అవసరం లేదని, జనసమూహాల నియంత్రణ ఆంక్షల ద్వారా దీని తీవ్రతను అదుపు చేయవచ్చని సూచించారు.
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావాన్ని గణిత శాస్త్ర పరంగా అంచనా వేశారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తోన్న 'సూత్ర మోడల్'ను వినియోగించారు. అయితే అదే సమయంలో పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వం తీసుకునే ముందస్తు చర్యలపైనే కొత్త వేరియంట్ వ్యాప్తి, ప్రభావం ఆధారపడి ఉంటుందన్నారు. బూస్టర్ డోస్‌కు కసరత్తు చేస్తోంది. మరోవైపు మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కేంద్ర ఆదేశించింది. వచ్చే 6 వారాలు అప్రమత్తంగా ఉంటే థర్డ్ వేవ్ గండం గట్టెక్కవచ్చని వైద్యనిపుణులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment