సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు ఏమీ మారలేదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని బట్టి తెలుస్తోంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉన్న అధికరణాలను రద్దు చేసిన అనంతరం ఆస్తుల కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. కేవలం ఇద్దరంటే ఇద్దరు ఆస్తులు కొనుగోలు చేసినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో మంగళవారం ప్రకటించారు.
జమ్మూకశ్మీర్‌కు 370 అధికరణను రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా 5 ఆగస్టు 2019లో ఏర్పాటుచేశారు. రద్దుకు ముందు కశ్మీర్ ప్రాంతంలో ఇతర ప్రాంతీయులు ఆస్తుల కొనుగోళ్లపై నిషేధం అమల్లో ఉండేది. అధికరణాల రద్దు అనంతరం ఇతర ప్రాంతాలవారు పెద్ద ఎత్తున వచ్చి ఆస్తులు కొనుగోలు చేస్తారని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం ఆశించిన మేర జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేయలేదు.
ఆస్తుల కొనుగోళ్ల చట్టాలలో మార్పులు చేయడంతో కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్, లడ్డాఖ్‌లో దేశంలోని ఇతర పారిశ్రామికవేత్తలు, ఇతర వ్యాపారులు పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసి కశ్మీర్ అభివృద్ధి బాట పడుతుందని పేర్కొన్నారు. కానీ వాస్తవంగా ఆ ప్రాంతంలో ఎలాంటి మార్పులు రాలేదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
- అధికరణ 370 రద్దును కశ్మీర్ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీకి చెందిన పార్టీ నాయకులు కూడా తప్పుబట్టారు.
- కేంద్ర ప్రభుత్వం భావించినట్టు జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మారలేదు. సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఎవరూ ఆస్తుల కొనుగోలుకు ముందుకు రావడం లేదు.
- పారిశ్రామికవేత్తలు కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపడం లేదు.
- ఉగ్రవాదుల దాడుల భయం ఇంకా కొనసాగుతోంది.
- ఇక కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ వంటివి ఉండడంతో ప్రస్తుతం కశ్మీర్‌పై ఎవరూ దృష్టి సారించలేదు.
Comments
Please login to add a commentAdd a comment