దద్దరిల్లిన పార్లమెంట్‌.. అదే ప్రతిష్టంభన  | Parliament Budget Session: Ruckus In Both houses Rahul Remark Adani Issue | Sakshi
Sakshi News home page

దద్దరిల్లిన పార్లమెంట్‌.. అదే ప్రతిష్టంభన 

Published Wed, Mar 22 2023 9:45 AM | Last Updated on Wed, Mar 22 2023 10:00 AM

Parliament Budget Session: Ruckus In Both houses Rahul Remark Adani Issue - Sakshi

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ అక్రమాలపై విచారణ కోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్‌ నుంచి విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని కించపర్చారని, క్షమాపణ చెప్పాలని బీజేపీ పట్టుబడుతోంది. దీంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం స్తంభించాయి. లోక్‌సభ మంగళవారం ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో స్పీకర్‌ బిర్లా జోక్యం చేసుకున్నారు.

అయినా ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. శాంతించాలంటూ సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ విన్నవించారు. అయినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు రాజేంద్ర ప్రకటించారు. రాహుల్‌ క్షమాపణ చెప్పాలన్న బీజేపీ సభ్యుల నినాదాలతో రాజ్యసభ దద్దరిల్లింది.

ప్రజల ఆకాంక్షలను వమ్ము చేయొద్దని సభ్యులకు రాజ్యసభ చైర్మన్‌ ధన్‌ఖడ్‌ హితవు పలికారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ వెల్లడించారు. ప్రతిష్టంభనకు తెరదించడమే లక్ష్యంగా లోక్‌సభ స్పీకర్‌ మంగళవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. సమస్యను పరిష్కరించే విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో అఖిలపక్ష సమావేశం విఫలమైంది.   

లోక్‌సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి 
పలువురు కేంద్ర మంత్రులు లోక్‌సభలో తనపై పూర్తి నిరాధారమైన, అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. వాటిపై సభలో సమాధానం చెప్పే హక్కు తనకు ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఓ లేఖ రాశారు. 

కారిడార్లలో విపక్షాల నిరసన
అదానీ గ్రూప్‌ నిర్వాకంపై విచారణకు జేపీసీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. వివిధ పార్టీల ఎంపీలు, నాయకులు మంగళవారం పార్లమెంట్‌ హౌస్‌ కారిడార్లలో నిరసన చేపట్టారు. జేపీసీ కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్యానర్లు ప్రదర్శించారు. అదానీ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు నిరసన తెలిపారు.

రూ.లక్ష కోట్ల కుంభకోణంలో భాగస్వామి అయిన అదానీని రక్షించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. అంతకంటే ముందు విపక్ష నేతలు సమావేశమయ్యారు. జేపీసీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, జేడీయూ, జేఎంఎం, ఆప్‌ తదితర పార్టీల నాయకులు ఈ భేటీకి హాజరయ్యారు.   

రూ.1.48 లక్షల కోట్ల అనుబంధ పద్దుకు ఆమోదం 
న్యూఢిల్లీ: ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.1.48 లక్షల కోట్ల అదనపు నిధుల ఖర్చుకు సంబంధించిన అనుబంధ పద్దుకు మంగళవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. అదానీ షేర్ల వివాదంపై విపక్ష పార్టీల నిరసనల నినాదాల మధ్యే ఈ పద్దుకు సభ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన మొత్తం రూ.2.7 లక్షల కోట్ల అదనపు పద్దును 13వ తేదీనే ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే.

అదనపు పద్దుకు సంబంధించి రూ.36,325 కోట్లను ఎరువుల సబ్సిడీ కోసం కేంద్రం ఖర్చుచేయనుంది.  వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ సంబంధిత మాజీ సైనికులకు కేంద్రప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.33,718 కోట్ల బకాయిలను ప్రభుత్వం మొత్తం పద్దులో కలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement