విపక్ష అభ్యర్థి సురేశ్‌పై విజయం
మూజువాణి ఓటుతో ఎన్నిక
మోదీ, రాహుల్ అభినందన
సీటు దాకా తోడ్కొని వెళ్లిన వైనం
విలువలకు పట్టం కడతా: బిర్లా
సభలో తొలి రోజే వాయిదా పర్వం
ఎమర్జెన్సీని ఖండిస్తూ బిర్లా తీర్మానం
తీవ్రంగా తప్పుబట్టిన విపక్షాలు
పార్లమెంటు ఆవరణలో బీజేపీ నిరసన
న్యూఢిల్లీ: అనూహ్యమేమీ జరగలేదు. అధికార ఎన్డీఏ పక్ష అభ్యర్థి ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ పదవికి బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు ఏ పార్టీ కూడా ఓటింగ్ కోసం పట్టుబట్టలేదు.
దాంతో మూజువాణి ఓటు ద్వారా విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై బిర్లా విజయం సాధించినట్టు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. స్పీకర్ ఎన్నికపై అధికార, విపక్ష కూటముల మధ్య నెలకొన్న రగడకు ఆ విధంగా తెర పడింది. అనంతరం మోదీ, విపక్ష నేత రాహుల్‌గాం«దీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు 61 ఏళ్ల బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లారు.
పారీ్టలకు అతీతంగా సభ్యులంతా చప్పట్లతో హర్షధ్వానాలు వెలిబుచ్చారు. అఖిలేశ్ యాదవ్ తదితర విపక్ష సభ్యులంతా ఈ సందర్భంగా బిర్లాను అభినందించారు. విధి నిర్వహణలో ఆయన నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని, ప్రజల గొంతుక వినిపించేందుకు విపక్షాలకు తగిన అవకాశాలిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. బలరాం జాఖడ్ అనంతరం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని తిరిగి స్పీకర్‌గా ఎన్నికైన రికార్డును బిర్లా సొంతం చేసుకున్నారు. లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 293, ఇండియా కూటమికి 233 మంది సభ్యుల బలముంది. వయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామాతో సభలో ఒక ఖాళీ ఉంది.
మోదీ తొలి ప్రసంగం
బిర్లా ఎన్నిక అనంతరం 18వ లోక్‌సభలో మోదీ తొలి ప్రసంగం చేశారు. గత ఐదేళ్లలో సభ హుందాతనాన్ని పరిరక్షించడంలో స్పీకర్‌గా బిర్లా గొప్ప పరిణతి చూపారంటూ ప్రశంసించారు. పలు చరిత్రాత్మక నిర్ణయాలతో లోక్‌సభ చరిత్రలో స్వర్ణయుగానికి సారథ్యం వహించారంటూ కొనియాడారు. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చన సందర్భాల్లోనూ ఆయన చక్కని సంతులనం పాటించారన్నారు. సభ నిర్వహణలో బిర్లా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతారని విశ్వాసం వెలిబుచ్చారు. పార్లమెంటేరియన్‌గా ఆయన పనితీరును కొత్త సభ్యులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
విపక్షాల అభినందనలు
రాహుల్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా 18వ లోక్‌సభ చక్కగా పని చేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈసారి సభలో విపక్షాల బలం పెరిగిందని గుర్తు చేశారు. వాటికి అందుకు తగ్గట్టుగా ప్రజా సమస్యలు లేవనెత్తేందుకు వీలైనన్ని అవకాశాలు లభించాలన్నారు. ఈ సభలో సభ్యుల సస్పెన్షన్ల వంటి సభ హుందాతనాన్ని తగ్గించే చర్యలుండబోవని అఖిలేశ్ ఆశాభావం వెలిబుచ్చారు. సుదీప్ బంధోపాధ్యాయ (టీఎంసీ), టీఆర్ బాలు (డీఎంకే) తదితరులు మాట్లాడారు.
నేడు పార్లమెంటు సంయుక్త సమావేశం
గురువారం పార్లమెంటు సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. మోదీ 3.0 నూతన సర్కారు ప్రాథమ్యాలను ఈ సందర్భంగా ఆమె పార్లమెంటు ముందుంచే అవకాశముంది. రాజ్యాంగంలోని 87వ ఆరి్టకల్ ప్రకారం లోక్‌సభ ఎన్నిక అనంతరం సమావేశాలు ప్రారంభమయ్యాక ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముర్ము గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి గుర్రపు బగ్గీలో సంప్రదాయ పద్ధతిలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకుంటారు. గజద్వారం వద్ద ప్రధానితో పాటు లోక్‌సభ, రాజ్యసభ ప్రిసైడింగ్ అధికారులు స్వాగతం పలుకుతారు. సంప్రదాయ సెంగోల్ చేబూని ముందు నడుస్తూ రాష్ట్రపతిని లోక్‌సభ చాంబర్లోకి తీసుకెళ్తారు.
మోదీ రాహుల్ కరచాలనం
స్పీకర్‌గా ఎన్నికయ్యాక బిర్లాను పోడియం వద్దకు తీసుకెళ్లే సందర్భంలో లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు నవ్వుతూ మాట్లాడుకోవడం సభ్యులందరినీ ఆకర్షించింది.
రాహుల్ నయా లుక్
స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ఆయన తెలుపు రంగు లాల్చీ, పైజామా ధరించి లోక్‌సభకు వచ్చారు. ఆయన కొన్నేళ్లుగా టీ షర్టు, బ్యాగీ ప్యాంటే ధరిస్తున్నారు. భారత్ జోడో యాత్రల్లోనూ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ అదే వస్త్రధారణ కొనసాగించారు. సోమ, మంగళవారాల్లో లోక్‌సభకు వచి్చనప్పుడు, సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కూడా టీ షర్టు, బ్యాగీ ప్యాంటులోనే కని్పంచారు. రాహుల్ ప్రస్తుతం లోక్‌సభలో విపక్ష నేత కావడంతో అందుకు తగ్గట్టుగా లాల్చీ, పైజామాకు మారినట్టు భావిస్తున్నారు.
‘‘స్పీకర్‌గా ఎన్నికైన మీకు విపక్షం తరఫున, ‘ఇండియా’ కూటమి తరఫున మీకు అభినందనలు. ఉభయ సభలు సజావుగా సవ్యంగా సాగాలని ఆశిస్తున్నాం. విశ్వాసంతోనే సహకారం సాధ్యమవుతుంది. ప్రజావాణి పార్లమెంట్‌లో ప్రతిధ్వనించాలి. ప్రభుత్వం వెంట అధికార బలం ఉండొచ్చేమోగానీ విపక్షాలు గతంతో పోలిస్తే మరింత గట్టిగా ప్రజావాణిని పార్లమెంట్‌లో వినిపించనున్నాయి. మమ్మల్ని మాట్లాడేందుకు మీరు అనుమతిస్తారని విశ్వసిస్తున్నాం. విపక్షసభ్యులు మాట్లాడితే ప్రజల గొంతు పార్లమెంట్‌లో మోగినట్లే. ఈ మేరకు మీరు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి’’
‘‘గత లోక్‌సభ సెషన్లు అత్యంత ఫలవంతమయ్యాయని ప్రభుత్వం ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది. విపక్షసభ్యులందరినీ సస్పెండ్ చేసి సభలో మౌనం రాజ్యమేలేలా చేయడం అప్రజాస్వామిక విధానం. సభ అత్యంత ప్రభావవంతంగా నడవడం కంటే ప్రజావాణి ఎంతగా సభలో వినిపించింది అనేదే ముఖ్యం’’
– రాహుల్ గాంధీ
‘‘ప్రజాస్వామ్య న్యాయానికి ఓం బిర్లాయే చీఫ్ జస్టిస్. మరెవరి ఆదేశాల ప్రకారమోకాకుండా ఆయన మార్గదర్శకత్వంలోనే సభ సజావుగా సాగాలని ఆశిస్తున్నా. వివక్షలేకుండా ప్రతి రాజకీయ పక్షానికి సమానమైన అవకాశాలు కలి్పంచాలి. నిష్పక్షపాత వైఖరి ప్రదర్శించడం గొప్ప బాధ్యత. సస్పెన్షన్ వంటి సభ గౌరవానికి హాని కల్గించే చర్యలు పునరావృతంకాబోవని భావిస్తున్నా’’
– అఖిలేశ్ యాదవ్
‘‘ సభలో విపక్షాలు బలం పుంజుకున్నాయి. దీంతో సభ కొత్తరూపు సంతరించుకుందిగానీ బీజేపీ వైఖరి మారలేదు. మెజారిటీ సభ్యులున్న పారీ్టలకు ప్రాధాన్యత దక్కుతోంది. సభకు సారథి అయిన స్పీకర్ చిన్న పార్టీలనూ పట్టించుకోవాలి’’
– అసదుద్దీన్
అడ్డంకులు లేకుండా సాగాలి...
‘‘నన్ను స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు సభకు ధన్యవాదాలు. అధికార, విపక్ష సభ్యులు ఒక్కతాటిపై నడిస్తేనే సభ సాగుతుంది. ప్రతి ఒక్కరి గొంతుకనూ వినడమే భారత ప్రజాస్వామ్యపు మూలబలం. ఏకైక సభ్యుడున్న పారీ్టకి కూడా సభలో కావాల్సినంత సమయం లభించాలి. మనల్ని ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నుకున్నారు. కనుక వారి సమస్యల పరిష్కారం కోసం సభ అడ్డంకుల్లేకుండా నడుస్తుందని ఆశిస్తున్నా. విమర్శలుండొచ్చు. కానీ సభను అడ్డుకోవడం సరి కాదు. సభ్యులపై చర్యలు తీసుకోవాలని నాకెప్పుడూ ఉండదు. కానీ ఉన్నత పార్లమెంటరీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చు’’
– స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం లోక్‌సభనుద్దేశించి ఓం బిర్లా
Comments
Please login to add a commentAdd a comment