![photo clicked at a funeral in Kerala is going viral on social media - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/24/smiling-photo.jpg.webp?itok=BpOviAz0)
తిరువనంతపురం: ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో ఏడుపులు వినిపిస్తాయి. కుటుంబసభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోతారు. బంధువులు, చుట్టుపక్కల వారు వారిని ఓదారుస్తుంటారు. కానీ కేరళ పథానంతిట్ట జిల్లా మలపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో కుటుంబసభ్యులు ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు. 95 ఏళ్ల బామ్మ చనిపోతే.. ఆమె శవపేటిక చుట్టూ చేరి నవ్వుతూ ఫోటో దిగారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
ఇంట్లో ఒకరు చనిపోతే మీరంతా ఎలా నవ్వుతున్నారని కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు మాత్రం ఆ ఫోటోలో ఏం తప్పులేదని కుటంబసభ్యులను వెనకేసుకొచ్చారు. దీనిపై పెద్ద చర్చే పెట్టారు. కేరళ విద్యాశాఖ మంత్రి వీ శివన్‌కుట్టి కూడా ఈ చర్చలో భాగమయ్యారు.
95ఏళ్ల మరియమ్మ ఆగస్టు 17న మరణించారు. ఆమెకు 9 మంది సంతానం. వాళ్లకు 19 మంది పిల్లలున్నారు. కుటుంబసభ్యులంతా దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో కొద్ది వారాల పాటు మంచానికే పరిమితమై మరియమ్మ కన్నుమూశారు. విషయం తెలిసి దాదాపు కుటంబసభ్యులు అందరూ స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె జ్ఞాపకార్థం ఓ ఫోటో దిగాలని కెమెరా ముందు నవ్వుతూ కన్పించారు.
మరియమ్మ బతికినంతకాలం ఎంతో సంతోషంగా జీవించారని, అందరినీ ప్రేమగా చూసుకున్నారని ఓ కుటుంబసభ్యుడు తెలిపారు. అందుకే ఆమెకు కుటుంబసభ్యులంతా ఆనందంతో వీడ్కోలు ఇవ్వాలనుకున్నట్లు పేర్కొన్నారు. నవ్వుతూ ఫోటో దిగడంలో తప్పేమీ లేదన్నారు.
కేరళ మంత్రి శివన్‌కుట్టి కూడా కుటుంబసభ్యులకు అండగా నిలిచారు. చావు చాలా బాధాకరం అని పేర్కొన్నారు. జీవితాంతం ఆనందంగా బతికిన వారిని అంతిమ వీడ్కోలులో నవ్వుతూ సాగనంపడంలో తప్పేం లేదన్నారు. ఈ ఫోటోపై నెగెటివ్‌గా స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
చదవండి: కాంగ్రెస్‌కు యువనేత గుడ్‌బై.. గాంధీలపై విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment