దేశంలో పలు పండుగలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయ రీతిలో జరుగుతుంటాయి. హోలీ విషయంలోనూ ఇదేవిధంగా కనిపిస్తుంటుంది. సాధారణంగా మహిళల కన్నా పురుషులు హోలీ వేడుకల్లో అత్యంత ఉత్సాహాన్ని కనబరచడం చూస్తుంటాం. కానీ యూపీలోని ఒక ప్రాంతంలో దీనికి భిన్నంగా జరుగుతుంటుంది.
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో హోలీ మర్నాడు స్త్రీలు తమ ప్రత్యేక హోలీని జరుపుకుంటారు. ఆరోజు అక్కడ మహిళలదే రాజ్యం. పురుషులెవరూ గ్రామంలో కనిపించరు. పిలిభిత్ నగరంలోని మధోతండా ప్రాంతంలో ఈ ప్రత్యేక సంప్రదాయం కనిపిస్తుంది. హోలీ మర్నాడు ఈ ప్రాంతంలోని మహిళలంతా గుంపులు గుంపులుగా తిరుగుతూ హోలీ వేడుకలు చేసుకుంటారు.
ఆ రోజున స్థానిక మహిళలు హోలీ సంప్రదాయ పాటలు పాడుతూ రోడ్లపై తిరుగుతారు. పాదచారులు, వాహనదారుల నుంచి చందాలు సేకరిస్తారు. ఆ రోజున గ్రామంలోని పురుషులంతా తమ ఇళ్లలో దాక్కుంటారు. లేదా ఊరి బయట ఎక్కడైనా తలదాచుకుంటారు. పిలిభిత్ నగర చరిత్రపై పరిశోధనలు సాగిస్తున్న సీనియర్ జర్నలిస్టు డాక్టర్ అమితాబ్ అగ్నిహోత్రి మీడియాతో మాట్లాడుతూ మధోతండాలో మహిళలు జరుపుకునే హోలీకి శతాబ్దాల చరిత్ర ఉందన్నారు.
మాధోతండా అనేది అడవి అంచున ఉన్న ప్రాంతం. పూర్వం రోజుల్లో హోలీ మరుసటి రోజున పురుషులు వేటకు వెళ్లేవారు. ఈ రోజున మహిళలు ఒకచోట చేరి హోలీ ఆడుకునేవారు. క్రమేణా ఈ హోలీ సంప్రదాయ రూపాన్ని సంతరించుకుంది. ఇప్పుడు వేటతో పాటు అడవిలోకి వెళ్లడాన్ని నిషేధించినందున స్థానికంగా ఉన్న మగవారు ఆ రోజున గ్రామాన్ని విడిచిపెట్టి బయటకు వెళతారు. తండాలో మహిళలు హోలీ ఆడే సమయంలో వారికి పురుషులెవరైనా ఎదురైతే వారి నుండి భారీగా చందా వసూలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment