
వారణాసి : కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ నిర్మాణ రంగ కార్మికులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూల వర్షం కురిపించారు. కారిడార్ నిర్మాణంలో పాల్గొన్న వారిపై పూలు చల్లి సన్మానించారు. ప్రతి ఒక్క కార్మికుడిపై పూలు చల్లేందుకు ఆ ప్రాంగణమంతా తిరిగారు. ఈ సందర్భంగా కొంతమంది కార్మికులను మోదీ ఆప్యాయంగా పలకరించి, ముచ్చటించారు. కారిడార్ నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్జతలు తెలియజేశారు. అనంతరం వారితో గ్రూప్‌ఫోటో దిగారు. కొద్దిసేపు ముచ్చటించి వారితో లంచ్ కూడా చేశారు.
కాగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో సోమవారం ప్రధాని మోదీ కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ కారిడార్‌ను జాతికి అంకితం చేశారు. కాశీ విశ్వనాథుడి మందిరం, కాల భైరవేశ్వరుడి ఆలయాన్ని ఆధునికీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దీని నిర్మాణ వ్యయం 339 కోట్ల రూపాయల పైమాటే. ఈ కార్యక్రమం కంటే ముందు కాశీ విశ్వనాథుడికి ప్రధాని మోదీ జలాభిషేకం చేశారు. గంగా నదిలో పుణ్య స్నానం చేసి.. ఆ నది జలంతో విశ్వనాథుడి వద్దకు వెళ్లి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు.
వారణాసి ఎంపీగా.. కాశీ విశ్వనాథ్ కారిడార్ పనులకు 2019 మార్చి 8న మోదీ శంకుస్థాపన చేయగా, రూ.339 కోట్లతో పూర్తయిన కాశీ విశ్వనాథ్ కారిడార్ తొలి దశ పనులను ఇవాళ మోదీ ప్రారంభించారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు కేవలం భవనాల నిర్మాణం కాదని.. భారత సనాతన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని మోదీ అన్నారు.
#Varanasi: PM @narendramodi honours Swacchata Mitra at the inauguration of #KashiVishwanathDham pic.twitter.com/GQi31u53K3
— DD News (@DDNewslive) December 13, 2021