సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కాళీమాత వివాదం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా కాళీ ఆశీర్వాదాలు ఉంటాయని పేర్కొన్నారు. కాళీమాతను బెంగాల్‌లోనే కాదు దేశం మొత్తం పూజిస్తుందని పేర్కొన్నారు.
స్వామి ఆత్మస్థానంద శతజయంతి వేడుకల సందర్భంగా మాట్లాడిన మోదీ.. రామకృష్ట పరమహంస కూడా కాళీమాతను ఆరాధించేవారని పేర్కొన్నారు. స్వామి వివేకానంద ఎంతో గొప్ప వ్యక్తి అయినా.. కాళీమాత పూజ విషయానికి వచ్చేసరికి చిన్న పిల్లాడిలా మారిపోయేవారని తెలిపారు. స్వామి ఆత్మస్థానంద కూడా కాళీమాతను పూజించేవారన్నారు.
కాళీమాత తన దృష్టిలో మాంసం తిని మధ్యం తాగే దేవత అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ వివాదాస్పద సినిమా పోస్టర్‌పై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాళీమాతను అవమానించేలా మాట్లాడిన మహువాను టీఎంసీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.
ఆమె మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు. హిందూ ధర్మాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా? కాళీమాతను ఎలా పూజించాలో వాళ్లు చెప్పడమేంటి అని ప్రశ్నించారు. బెంగాల్‌లో సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయన్నారు.
ఈ నేపథ్యంలో కాళీమాత అంశంపై మోదీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆయన సినిమా పోస్టర్‌పై గాని, టీఎంసీ ఎంపీ పేరును గానీ ఎక్కడా ప్రస్తావించలేదు.
Comments
Please login to add a commentAdd a comment