రుజువర్తన, పారదర్శకత విషయంలో రాజీ వద్దు
నూతన మంత్రులకు ప్రధాని మోదీ ఉద్బోధ
న్యూఢిల్లీ: అధికార దర్పం ప్రదర్శించకుండా వినయంగా ఉన్న నాయకులనే ప్రజలు అభిమానిస్తారని నరేంద్ర మోదీ చెప్పారు. అందుకే వినయంగా ఉండాలని నూతన మంత్రులకు సూచించారు. రుజువర్తన, పారదర్శకత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని చెప్పారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతలకు మోదీ తన నివాసంలో తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనపై ప్రజలకు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని అన్నారు.
మీకు అప్పగించిన పనిని నిజాయతీగా పూర్తి చేయండి అని సూచించారు. పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులందరికీ తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొన్నారు. మంత్రులు అందరితో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను గౌరవించాలని చెప్పారు. అందరిని కలుపుకొనిపోవాలని, బృంద స్ఫూర్తితో పని చేయాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment