న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు జి–20లో సహకారంపై ప్రభావం చూపనీయరాదని, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏకాభిప్రాయానికి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభంపై దేశాల మధ్య విభేదాలు పొడచూపిన నేపథ్యంలో గురువారం జి–20 దేశాల విదేశాంగ మంత్రులకు ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం పంపారు. ‘మహాత్మాగాంధీ, గౌతమబుద్ధుడి నేలపై కలుసుకున్న మీరు, భారతదేశ నాగరికత, తాత్వికతల నుంచి ప్రేరణ పొందాలని, మనల్ని విభజించే వాటిపై కాకుండా, మనల్ని ఐక్యంగా ఉంచే అంశాలపై దృష్టి పెట్టాలి’అని సూచించారు.
‘అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాజాతీయ నేరాలు, అవినీతి, ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత’వంటి అంశాల్లో పరిష్కారం కోసం ప్రపంచం జి–20 వైపు చూస్తోంది. ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించి, ఫలితాలను రాబట్టే సామర్థ్యం జి–20కి ఉంది’అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సమాజంలో తీవ్ర విభేదాలు తలెత్తిన సమయంలో మనం కలుసుకున్నాం. మన మధ్య జరిగే చర్చలు భౌగోళిక రాజకీయాల ప్రభావం ఉండటం సహజం. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాల ప్రతినిధులుగా ఇక్కడ లేని వారి పట్ల కూడా మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది’అని ప్రధాని పేర్కొన్నారు.
వ్యవస్థలు విఫలం
‘గత కొద్ది సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, యుద్ధాలు..వంటి వాటిని ఎదుర్కొన్న విధానం చూస్తే అంతర్జాతీయ వ్యవస్థలు ఎలా దారుణంగా విఫలమయ్యాయో స్పష్టమవుతోంది. ఈ వైఫల్యం విషాదరకర పరిణామాలను అభివృద్ధి చెందుతున్న దేశాలే ఎక్కువగా ఎదుర్కొన్నాయనే విషయం మనం అంగీకరించాలి. ఏళ్లపాటు సాధించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు తిరోగమించే ప్రమాదం ఉంది’అని ప్రధాని హెచ్చరించారు.
అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలు తమ ప్రజానీకానికి ఇంధన, ఆహార భద్రతను అందించే క్రమంలో తీవ్రమైన రుణ భారంతో అవస్థలు పడుతున్నాయన్నారు. ధనిక దేశాల కారణంగా వచ్చిన గ్లోబల్ వార్మింగ్‌తోనూ ఆయా దేశాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. తమ నిర్ణయాల వల్ల ఎక్కువగా ప్రభావితమైన వారి మాట వినకుండా ఏ వర్గం కూడా తమదే ప్రపంచ నాయకత్వమంటూ చాటుకోలేదని మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి జై శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమెరికా, రష్యా, చైనా, యూకేల విదేశాంగ మంత్రులు వరుసగా ఆంటోనీ బ్లింకెన్, లావ్రోవ్, క్విన్, క్లెవెర్లీతోపాటు ఈయూ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇటలీ ప్రధానితో చర్చలు
భారత్, ఇటలీలు రక్షణ సహకారంలో కొత్త అధ్యాయానికి తెరతీస్తూ తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీతో వివిధ అంశాలపై ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం మెలోనీతో కలిసి మోదీ మీడియాతో మాట్లాడారు. సంయుక్త భాగస్వామ్యం, సంయుక్త అభివృద్ధి రంగాల్లో భారత్‌లో నూతన అవకాశాలకు దారులు తెరుచుకున్నాయన్నారు. ఈ బంధం ఉభయతారకమని చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం అంశాలపై రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment