లక్నో: కరోనా వ్యాక్సిన్‌కు హడావుడిగా ఇచ్చిన అనుమతులపై రాజకీయాలు చేయడం తగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. రాజకీయ నాయకులు అక్కడా, ఇక్కడా ఏవేవో మాట్లాడుతూ ఉంటారని, కానీ శాస్త్రవేత్తల నిర్ణయం మేరకే తాను ముందుకి అడుగులు వేశానని అన్నారు. సాధారణ ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వైద్య సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు.
‘‘కరోనా టీకా భద్రత, సామర్థ్యంపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. టీకా తీసుకున్న ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్‌కు క్లీన్ చిట్ ఇస్తే ప్రజల్లో గట్టి సందేశం వెళుతుంది’’అని ప్రధాని అన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆస్పత్రి మాట్రన్, నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, డాక్టర్‌లతో ప్రధాని 30 నిముషాల సేపు మాట్లాడారు. మోదీతో మాట్లాడిన వారందరూ తమకు వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ అఫెక్ట్‌లు రాలేదని వెల్లడించారు. వారణాసి జిల్లా మహిళా ఆస్పత్రి మాట్రాన్ పుష్ప దేవితో తొలుత మోదీ మాట్లాడారు.
కరోనా వ్యాక్సిన్ సురక్షితమైనదన్న నమ్మకం మీకుందా అని ప్రశ్నించారు. దానికి ఆమె టీకా తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ‘‘వ్యాక్సిన్ అంటే ఒక ఇంజక్షన్ తీసుకోవడం లాంటిదే. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. అందరినీ టీకా తీసుకోవాలని నేను చెబుతున్నాను’’అని ఆమె వెల్లడించారు. డీడీయూ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ వి శుక్లాతో మాట్లాడిన ప్రధాని కరోనా సంక్షోభ సమయంలో వైద్య సిబ్బంది చేసిన కృషిని ప్రశంసించారు. డాక్టర్ శుక్లా కూడా వ్యాక్సిన్‌తో మేలే జరుగుతుందని అన్నారు. ఎవరికైనా సైడ్ అఫెక్ట్‌లు వచ్చినా దానికి వారి అనారోగ్య సమస్యలే కారణమని చెప్పారు. టీకా ఇవ్వడంలో ఆస్పత్రుల మధ్య పోటీ ఉంటే రెండో విడతని త్వరగా ప్రారంభించవచ్చునని ప్రధాని సూచించారు.
శాస్త్రవేత్తలు చెప్పిందే చేశాం
హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వడంపై చెలరేగిన విమర్శల్ని ఈ సందర్భంగా ప్రధాని పరోక్షంగా ప్రస్తావించారు. టీకా విషయంలో రాజకీయాలు చేయడం ఎంత మాత్రమూ తగదని అన్నారు.‘‘వ్యాక్సిన్‌కి అనుమతులివ్వడంపై నేను ఒక్కటే చెబుతాను. శాస్త్రవేత్తలు చెప్పినట్టే చేశాను. ఇది రాజకీయ నాయకుల పని కాదు’’అని అన్నారు. వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి రాకపోవడంతో తాను ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నట్టు మోదీ చెప్పారు.
మోదీకి హసీనా ధన్యవాదాలు
కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ 20 లక్షల డోసుల్ని భారత్ కానుకగా పంపించడంపై బంగ్లా ప్రధాని షేక్ హసీనా హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్న సంక్షోభ సమయంలో టీకా డోసులు అందడం ఆనందంగా ఉందన్నారు. టీకా పంపిణీకి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment