సాక్షి, ముంబై: కరోనా రెండో విడత కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావం పడినప్పటికీ, జూన్ మాసంలో ఉద్యోగ నియామకాలు పెరిగినట్టు ‘మాన్‌స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్’ అనే నివేదిక తెలియజేసింది. మాన్‌స్టర్ డాట్ కామ్ ఈ నివేదికను విడుదల చేసింది. కరోనా రెండో దశ, లాక్‌డౌన్‌లు ఉన్నప్పటికీ గడిచిన ఆరు నెలల్లో అన్ని రంగాల్లోనూ ఉద్యోగాల్లో వృద్ధి నెలకొన్నట్టు తెలిపింది. 2021 మే నెలతో పోలిస్తే జూన్ నెలలో ఉద్యోగ నియామకాల్లో 4 శాతం వృద్ధి నమోదైనట్టు పేర్కొంది. అదే వార్షికంగా 2020 జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగ నియామకాలు 7 శాతం పెరిగినట్టు తెలిపింది. రానున్న రోజుల్లో ఆశావహ పరిస్థితులు ఉండొచ్చని అంచనా వేసింది. ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రకటనలు, నియామకాల గణాంకాల ఆధారంగా మాన్‌స్టర్ సంస్థ ఈ నివేదికను రూపొందిస్తుంటుంది.
రంగాల వారీగా..
మాన్‌స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ 27 రంగాలకు సంబంధించిన గణాంకాలను ప్రతీ నెలా తన అంచనాల్లోకి తీసుకుంటుంది. జూన్‌లో అన్ని రంగాల్లోనూ ఉద్యోగ నియామకాలు మే నెలతో పోలిస్తే సానుకూలంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. దిగుమతులు, ఎగుమతుల రంగంలో 25 శాతం, తయారీ (14 శాతం), షిప్పింగ్, మెరైన్ (11 శాతం),హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ (10 శాతం) వృద్ధిని చూపించినట్టు వెల్లడించింది. బీఎఫ్‌ఎస్‌ఐ, టెలికం, రియల్ ఎస్టేట్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లోనూ నియామకాలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది. పర్యాటకం, రవాణా రంగంలోనూ మే నెలతో పోలిస్తే 3 శాతం మేర నియామకాలు పెరిగినట్టు తెలిపింది. ఎఫ్‌ఎంసీజీ, ఆగ్రో పరిశ్రమలు, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రింటింగ్ పరిశ్రమలు నియామకాల్లో ఒక శాతం వృద్ధిని చూపించాయి. వడోదరాలో 9 శాతం, పుణె, కోయింబత్తూర్, చండీగఢ్ తదితర నగరాల్లో నియామకాలు 6 శాతం మేర పుంజుకోగా, బెంగళూరులో 2 శాతం, హైదరాబాద్‌లో ఒక శాతం మేర పెరిగినట్టు నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment