సాధారణంగా చాలామంది వైద్యులు బంగాళదుంపలు(ఆలూ) ఆరోగ్యానికి అంతమంచివి కావని చెబుతుంటారు. మరోవైపు ఆరోగ్య స్పృహ కలిగినవారిలో కొందరు బంగాళాదుంపలకు దూరంగా ఉంటారు. అయితే మార్కెట్‌లోకి ఇటీవలే వచ్చిన ఒకరకం బంగాళదుంపలను నిరభ్యంతరంగా తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ బంగాళదుంపను ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (పూసా) వారు రూపొందించారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మోదీపురంలోని రీజనల్ సెంటర్‌లోని పూసాలోని సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కనుగొన్న ఈ కొత్త రకం బంగాళదుంప పేరు కుఫ్రీ జామునియా. ఈ రకాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలకు సుమారు తొమ్మదేళ్లు పట్టింది. దీనికి సంబంధించిన పరిశోధనలు 2015లో ప్రారంభమయ్యాయి. శాస్త్రవేత్తలు ఈ నూతన తరహా బంగాళదుంపను ప్రధానికి చూపించి, దాని ప్రత్యేకతను కూడా వివరించారు.
ఈ బంగాళాదుంపను కనుగొన్న పూసా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్‌కె లూత్రా మీడియాతో మాట్లాడుతూ కుఫ్రీ జామునియా అనేది యాంటీ-ఆక్సిడెంట్లుతో పాటు ఊదారంగు గుజ్జు కలిగిన బంగాళాదుంప రకం. 100 గ్రాముల దుంపలోని గుజ్జులో అధిక యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ సి (52 మి.గ్రా), ఆంథోసైనిన్ (32 మి.గ్రా), కెరోటినాయిడ్స్ (163 మైక్రోగ్రాములు) ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.
సాధారణ బంగాళదుంపలతో పోలిస్తే వీటిని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. కుఫ్రీ జామునియాను హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ , మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒరిస్సా, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో పండించేందుకు అనువైన వాతావరణం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment