
ముంబై: తన భార్య నవనీత్ కౌర్ రాణా అనారోగ్య సమస్యల గురించి ఫిర్యాదు చేసినా బైకుల్లా జైలు అధికారులు కనీసం పట్టించుకోలేదని ఎంపీ రవి రాణా ఆరోపించారు. తలోజా జైలు నుంచి గురువారం రవిరాణా విడుదలయ్యారు. రవిరాణా విడుదలకు రెండుగంటల ముందు బైకుల్లా మహిళా జైలునుంచి ఆయన భార్య నవనీత్ కౌర్ రాణా విడుదలయ్యారు.
గత నెల 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్ద హనుమాన్ చాలీసా పఠిస్తామన్న వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో వీరిద్దరినీ ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, వీరిద్దరికీ బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం కొన్ని గంటల వ్యవధిలో విడుదలయ్యారు.అనంతరం నవనీత్ రాణా అనారోగ్య సమస్యలతో సబ్ అర్బన్ బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. రవిరాణా విడుదలైన వెంటనే నేరుగా లీలావతి ఆస్పత్రికి వెళ్లి భార్యను పరామర్శించారు.
చదవండి: ఈ చిలుకను పట్టిస్తే రూ.5 వేలు.. ‘దయచేసి ఇచ్చేయండి ప్లీజ్’
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..గత ఆరు రోజుల నుంచి నవనీత్ ఆరోగ్యం బాగోలేదని బైకులా జైలు అధికారులకు ఫిర్యాదు చేసిందని, అయితే కనీసం జైలు అధికారులెవరూ ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వెళ్లిన వారిలో రవిరాణాతో పాటు బీజేపీ నేత కృతి సోమయ్య వెంట ఉన్నారు. కాగా, వార్డులో నవనీత్‌రాణా కంటతడి పెడుతండగా.. ఆమెను పట్టుకుని ఓదారుస్తూ రవిరాణా ఏడుస్తున్న వీడియో క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
— Navneet Ravi Rana (@navneetravirana) May 5, 2022