
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రముఖ వ్యాపారి, కశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రో హత్యకు గురయ్యారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి దుండగులు ఆయన్ను కాల్చి చంపారని పోలీసులు వెల్లడించారు. శ్రీనగర్‌లో ఆయనకు బింద్రో మెడికేట్ ఫార్మసీ వ్యాపారం ఉంది. ఇక్బాల్ పార్క్ వద్ద ఉన్న తన ఫార్మసీలో ఉన్న సమయంలో ఉగ్రవాదులు ఆయన వద్దకు వచ్చి కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనానంతరం ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, ఆస్పత్రికి చేరే సమయానికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనానంతరం మరో ఇద్దరు వ్యక్తులను కూడా ఉగ్రవాదులు కాల్చి చంపారు. భేల్‌పురి అమ్మే వీరేందర్‌ను పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. వీరేందర్‌ను చంపిన కొన్ని నిమిషాల్లోనే మొహమ్మద్ షఫి లోనె ను కూడా చంపారు. స్థానిక టాక్సీ స్టాండ్‌కు మొహమ్మద్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ హత్యలను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఖండించారు.