న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గవర్నర్లకు ఆత్మపరీశీలన అవసరమని వ్యాఖ్యానించింది. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బిల్లుల ఆమోదించడంలో చేస్తున్న జాప్యంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం తమ వద్దకు చేరక ముందే గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బిల్లుల ఆమోదంలో జాప్యంపై దాఖలైన కేసుపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ‘బిల్లుల విషయాలు సుప్రీంకోర్టు వద్దకు రాకముందే గవర్నర్లు చర్యలు తీసుకోవాలి. గవర్నర్లు అలా వ్యవహరించినప్పుడే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. గవర్నర్‌లకు ఆత్మ పరిశీలన అవసరం. అలాగే వారు ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాదన్న విషయం వారు తెలుసుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొంది.
పెండింగ్ బిల్లులపై పంజాబ్ గవర్నర్ పురోహిత్ తీసుకున్న చర్యలకు సంబంధించిన తాజా పరిస్థితిపై నివేదికను నవంబర్ 10 నాటికి సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
చదవండి: ప్రమాదస్థాయిలో వాయు కాలుష్యం.. ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం
ఇదిలా ఉంటే... ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ పురోహిత్ మధ్య ఇటీవలి కాలంలో విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 27 బిల్లుల్లో 22 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కానీ... అక్టోబరు 20న నాల్గవ బడ్జెట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు ద్రవ్య బిల్లులకు మాత్రం ఆమోదం తెలుపలేదు.
మూడు ద్రవ్య బిల్లులకు ఆమోదించకుండా అక్టోబరు 19న పంజాబ్ ముఖ్యమంత్రికి గవర్నర్ లేఖ రాశారు. బడ్జెట్ సమావేశాలను పొడిగించడమనేది అక్రమం, చట్ట విరుద్దమని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టేముందు ప్రతిపాదిత చట్టాలన్నింటినీ మెరిట్‌పై పరిశీలిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 20, 21న రెండు రోజులపాటు జరుగాల్సిన బడ్జెట్ పొడిగింపు సమావేశాలను పంజాబ్ ప్రభుత్వం కుదించింది.
గవర్నర్ ఆమోదించని వాటిలో పంజాబ్ ఆర్థిక, బడ్జెట్ నిర్వహణ (సవరణ) బిల్లు 2023, పంజాబ్ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు 2023, ఇండియన్ స్టాంప్ (పంజాబ్ సవరణ) బిల్లు 2023 బిల్లులు ఉన్నాయి వీటి ఆమోదంపైనే పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే నవంబర్ 1న పురోహిత్ మూడు ద్రవ్య బిల్లులలో రెండింటికి ఆమోదం తెలిపారు. ద్రవ్య బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలంటే అందుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి అన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment